నాణ్యమైన విద్యే లక్ష్యం

12 Jul, 2022 19:52 IST|Sakshi

ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం

ఫౌండేషన్‌ స్కూల్స్‌ నుంచి హైస్కూల్‌ ప్లస్‌గా నామకరణం

ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం

జిల్లాలో 591 పీఎస్‌ల నుంచి యూపీ, హైస్కూల్స్‌కు విద్యార్థులు

19 యూపీ స్కూల్స్‌ నుంచి 6, 7, 8 తరగతులు 15 హైస్కూల్స్‌ల్లోకి..

జిల్లాలో 17,588 మంది విద్యార్థులు ఆయా పాఠశాలల్లో విలీనం

పాఠశాలల్లో కొన్ని తరగతుల విలీనం చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల తరగతులు, హైస్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు విలీన ప్రక్రియను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరంభించింది. అయితే ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా.. విద్యార్థుల్లో కింది తరగతుల నుంచే విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.   

నెల్లూరు (టౌన్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యా విధానంలో అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా  2022–23 విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త అడుగు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఒకటి నుంచి మూడు కి.మీ. దూరంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ మేరకు పాఠశాలల విలీనం మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 

17,588 మంది విద్యార్థులు విలీనం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కి.మీ. దూరంలోపు ఉన్న 478 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 276 హైస్కూల్స్‌ల్లోకి విలీనం చేశారు. మరో 113 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 87 ప్రా«థమికోన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. కిలో మీటరు నుంచి 3 కి.మీ.లోపు ఉన్న 19 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను 15 ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,588 మంది విద్యార్థులు విలీనమయ్యారు. 

ఫౌండేషన్‌ నుంచి హైస్కూల్‌ ప్లస్‌గా ఏర్పాటు  
నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఫౌండేషన్‌ స్కూల్స్‌ నుంచి హైస్కూల్స్‌ ప్లస్‌గా తరగతుల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఫౌండేషన్‌ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5 తరగతుల వరకు, ప్రీ హైస్కూల్స్‌లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, హైస్కూల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్‌లో 3 నుంచి 12 తరగతుల వరకు నిర్వహిస్తారు. నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడిని నియమించనున్నారు.    

ఉపాధ్యాయుల సర్దుబాటు  
నూతన విద్యా విధానం అమలు చేయడంతో ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే అవసరానికి మించి 2,514 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. 980 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు తేలింది. వీరిని విద్యార్థులు ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులకు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా 45 పిరియడ్లకు మించకుండా చర్యలు తీసుకోనున్నారు. 

విలీనం వల్ల ఉపయోగాలు
విద్యార్థుల్లో ప్రాథమిక తరగతుల నుంచి విద్యా పునాదులు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉన్నా.. విద్యార్థులను బట్టి ఒకరిద్దరూ మాత్రమే ఉపాధ్యాయులు ఉంటారు. దీని వల్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులను బోధించడం వల్ల ప్రాథమిక స్థాయిలో మెరుగపడడం కష్టం. అదే 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే సబ్జెక్ట్‌కు ఒక టీచరు బోధించడం వల్ల విద్యార్థులోనైపుణ్యం పెరగడంతో పాటు ఉత్తమ బోధన అందుతుంది. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం ఉండడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. ఆటలు ఆడుకునేందుకు విశాల మైదానం ఉంటుంది. బాలురు, బాలికలకు విడివిడిగా టాయ్‌లెట్స్‌ ఉంటాయి. వీటితో పాటు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఆలోచన.   

విద్యార్థులకు ఎంతో మేలు 
3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌ల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి సబ్జెక్ట్‌కు  ఒక టీచరు ఉండడం వల్ల సబ్జెక్ట్‌పై విషయ పరిజ్ఞానం పెంచకునేందుకు వీలు పడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 117ను స్వార్థంగా ఆలోచించే ఉపాధ్యాయలు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  
– జీవీ ప్రసాద్, ఏపీ స్టూడెంట్స్‌ జేఏసీ చైర్మన్‌ 

 ఏ ఒక్క పాఠశాల మూతపడదు  
నూతన విద్యా విధానం వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కి.మీ. లోపు ఉంటే హైస్కూల్స్‌కు పంపిస్తున్నాం. ఆరు అంచెల విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాం. 3, 4 ,5 తరగతులకు సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల నాణ్యమైన బోధన అందుతుంది. హైస్కూల్స్‌ల్లో పూర్తిస్థాయిలో వసతులు ఉంటాయి.   
– పి. రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు