మద్యంపై పన్ను తగ్గింపు

19 Dec, 2021 03:44 IST|Sakshi

పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం నిరోధానికి ప్రభుత్వం చర్యలు

అన్ని రకాల బ్రాండ్లపై 15 నుంచి 20 శాతం మేర తగ్గనున్న ధరలు

అయినా, తెలంగాణ కంటే రాష్ట్రంలోనే 10 శాతం ఎక్కువ ధరలు

సాక్షి, అమరావతి: తెలంగాణ సహా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టడానికి, నాటు సారా తయారీని నిరోధించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, ఏక్సైజ్‌ డ్యూటీ, స్పెషల్‌ మార్జిన్‌లను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మద్య నియంత్రణలో భాగంగా మద్యం వినియోగం తగ్గించడానికి ధరలను ప్రభుత్వం గతంలో పెంచిన విషయం తెలిసిందే. దీంతో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కట్టడి చేయడానికి మద్యం మీద పన్ను రేట్లను తగ్గించారు. దీనివల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్‌లపై 15 నుంచి 20 శాతం మేర ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం రూ.200 ఉన్న మద్యం బాటిల్‌.. సవరించిన రేట్ల ప్రకారం రూ.150కు లభించే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని రకాల బీర్లపై రూ.20 మేర ధరలు తగ్గనున్నాయి. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంకన్నా 10 శాతం అదనంగా మద్యం ధరలు ఉంటాయి.   

మరిన్ని వార్తలు