మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

30 Nov, 2020 05:33 IST|Sakshi
హత్యాయత్నంపై మంత్రి పేర్ని నాని నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

తాపీతో రెండుసార్లు పొడిచిన టీడీపీ కార్యకర్త

అదృష్టవశాత్తు తప్పించుకున్న మంత్రి

సరిగ్గా ఐదు నెలల క్రితం మంత్రి నాని అనుచరుడు భాస్కరరావు హత్య

అదే తరహాలో మంత్రినీ హతమార్చేందుకు ప్రయత్నించి విఫలం

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగింది. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. సరిగ్గా ఐదు నెలల క్రితం (జూన్‌ 29) మంత్రి నానికి ప్రధాన అనుచరుడైన మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావును టీడీపీకి చెందిన వ్యక్తులు కొబ్బరి కాయల్ని ఒలిచే పొడవాటి ఇనుప ఊచలాంటి ఆయుధంతో పట్టపగలే పొడిచి చంపారు. అదే తరహాలో మంత్రి నానిని కూడా మట్టుబెట్టేందుకు యత్నించడం కలకలం రేపింది. 

ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మంత్రి పేర్ని నాని తల్లి, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి సతీమణి నాగేశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పెద్దకర్మ ఆదివారం మచిలీపట్నం మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి నాని రామానాయుడు పేటలోని ఇంటివద్ద పూజా కార్యక్రమాలు ముగించుకుని ఉదయం 11.10 గంటల సమయంలో మార్కెట్‌ యార్డుకు బయలుదేరేందుకు బయటకు వచ్చారు. మంత్రి మెట్లు దిగుతుండగా.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలతో కలసి అక్కడ వేచివున్న టీడీపీ కార్యకర్త బడుగు నాగేశ్వరరావు మంత్రి కాళ్లకు నమస్కారం పెట్టేందుకు అన్నట్టుగా కిందకు వంగి.. వెంట తెచ్చుకున్న పదునైన తాపీతో మంత్రి పొత్తి కడుపులో బలంగా పొడిచాడు. ఆ సమయంలో మంత్రి కాస్త వెనక్కి జరగటం, తాపీ ఆయన ప్యాంట్‌పై ధరించిన లెదర్‌ బెల్ట్‌ బకెల్‌కు బలంగా తగలటంతో వంగిపోయింది.

వెంటనే నిందితుడు నాగేశ్వరరావు మంత్రి చొక్కా కాలర్‌ పట్టుకుని మరోసారి పొడిచేందుకు యత్నించాడు. రెండోసారి కడుపులో బలంగా పొడిచినప్పటికీ అప్పటికే తాపీ వంగిపోవడంతో మంత్రికి ఎలాంటి గాయం కాలేదు. ఆ సమయంలో బటన్స్‌ ఊడిపోయి మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. వెంటనే తేరుకున్న మంత్రి నిందితుణ్ణి వెనక్కి తోసేశారు. అయినా నిందితుడు పట్టు వదలకుండా మరోసారి దాడి చేసేందుకు యత్నించగా.. మంత్రి కిందపడిపోయారు. అక్కడే ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి, పార్టీ నాయకుడు పరింకాయల విజయ్‌ మంత్రిని లేవదీయగా.. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోకిì తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ వెంటనే మంత్రి నాని చొక్కా మార్చుకుని ఆటోలో బయల్దేరి మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మార్కెట్‌ యార్డుకు వెళ్లి మంత్రి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిందితుడు ‘కొల్లు’ అనుచరుడే
మంత్రిపై హత్యాయత్నానికి ఒడిగట్టిన బడుగు నాగేశ్వరరావు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడైన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు. తెలుగు మహిళ విభాగం నగర శాఖ అధ్యక్షురాలు బడుగు ఉమాదేవి సోదరుడు. గడచిన ఎన్నికల్లో టీడీపీ తరఫున క్రియాశీలంగా పని చేశాడు. మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు (57)ను స్థానిక చేపల మార్కెట్‌ సమీపంలో పథకం ప్రకారం జూన్‌ 29న పట్టపగలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కుట్రదారునిగా కేసు నమోదు కాగా ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు తిరక్కుండానే మంత్రి నానిపై టీడీపీ కార్యకర్త హత్యాయత్నానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.

పలువురు మంత్రులు పరామర్శ
మంత్రి పేర్ని నానిని హోంమంత్రి మేకపాటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, సింహాద్రి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, వల్లభనేని వంశీ, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత తదితరులు పరామర్శించారు.

ఏ ఉద్దేశంతో ఈ చర్యకు ఒడిగట్టాడో..
నా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ నేరుగా కలుస్తాను. అందువల్ల ప్రజలకు, నాకు మధ్య స్కానింగ్‌లు, చెకింగ్‌లు వద్దని భద్రతా సిబ్బందికి చెబుతాను. ఈ రోజు మా అమ్మగారి పెద్ద కర్మ కోసం ఇంటి వద్ద పూజాధికాలు ముగించుకుని మార్కెట్‌ యార్డుకు బయల్దేరుతున్న సమయంలో బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి నా కాళ్లకు దణ్ణం పెట్టేందుకు అన్నట్టుగా వంగి నాపై దాడికి యత్నించాడు. రెండసార్లు పొడించేందుకు ప్రయత్నించగా అదృష్టవశాత్తు తప్పించుకున్నా. అతను ఎన్నికల్లో టీడీపీ తరఫున యాక్టివ్‌గా తిరిగాడు. ఎందుకు ఈ చర్యకు ఒడిగట్టాడో తెలియడం లేదు. కారణాలేమిటనేది పోలీసుల విచారణలో బయట కొస్తాయి.
– పేర్ని నాని, మంత్రి

విచారణ ప్రారంభించాం
నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడు. మంత్రిపై హత్యాయత్నం వెనుక ఎవరి హస్తముందో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఈ ఘటన వెనుక రాజకీయ కోణమా.. లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మంత్రి పేర్ని నానిని కలిసి తన బాధను చెప్పుకోడానికి వచ్చినట్టు నిందితుడు చెబుతున్నాడు. బాధ చెప్పుకునే వ్యక్తి.. ఆయుధంతో ఎందుకు వచ్చాడో విచారణ జరుపుతున్నాం.
– ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ


 హత్యాయత్నానికి ఉపయోగించిన తాపీ


పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బడుగు నాగేశ్వరరావు   


పేర్ని నానితో మాట్లాడుతున్న డెప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, శాసనసభ్యులు సింహాద్రి రమేష్, ప్రసాదరాజు, వల్లభనేని వంశీ 

మరిన్ని వార్తలు