ప్రేమోన్మాదికి వత్తాసు పలుకుతారా? 

9 Jan, 2021 10:13 IST|Sakshi
పరామర్శించేందుకు వచ్చిన మంత్రికి నమస్కరిస్తున్న యువతి 

మహిళలను వేధించడం టీడీపీ వర్గీయులకు అలవాటే 

బాధితురాలికి అండగా ఉంటాం 

మంత్రి శంకరనారాయణ వెల్లడి 

సాక్షి, సోమందేపల్లి: రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడటం టీడీపీ వర్గీయులకు మామూలేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. సోమందేపల్లిలో టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులకు గురైన యువతి కుటుంబ సభ్యులను మంత్రి శంకరనారాయణ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత యువతికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015లో తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ నేతలు ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. ఆ పార్టీ నేతలు మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే వాటిని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు.

నారా లోకేష్‌ అవగాహనారాహిత్యంతో ట్వీట్‌లు, ఫేక్‌ వీడియోలు పెడుతున్నాడని.. ఓ యువతి పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి ప్రేమోన్మాదులకు మద్దతు పలకడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 2018లోనే తాను లైంగిక వేధింపులకు గురవుతున్నానని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసార«థి అండతో స్ధానిక టీడీపీ నాయకుల సహకారంతో పద్మాచారి ఒక్క రోజులోనే స్టేషన్‌ బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చాడన్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే మూడేళ్లుగా ఆ కుటుంబం మానసిక క్షోభకు గురయ్యేది కాదన్నారు. ప్రస్తుతం పోలీసులు యువతి కుటుంబానికి న్యాయం చేయాలని చూస్తుంటే మరో టీడీపీ కార్యకర్త కళాచారి బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఆత్మహత్యాయత్నం డ్రామా చేస్తే బీకే పార్థసారథి అలాంటి వారిని పరామర్శించడం ఏమిటని నిలదీశారు.

అదే ప్రాంతంలో ఉంటున్న యువతి కుటుంబానికి కనీస సానుభూతి తెలపకుండా వెళ్లడం సమంజసం కాదన్నారు. నిలదీసిన మహిళలపై టీడీపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడం ఆ పార్టీ తీరుకు నిదర్శనమన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ శ్రీహరితో మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ వెంకటరత్నం, మాజీ సర్పంచ్‌లు డి.సి.ఈశ్వరయ్య, సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.  

మూడేళ్లుగా నరకం చూస్తున్నా సార్‌!  
మూడేళ్లుగా టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులతో నరకం అనుభవిస్తున్నా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసు పెట్టినా పలుకుబడితో ఒక్కరోజులోనే బయటకు వచ్చి లైంగిక వేధింపులకు గురి చేశాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా అతనికి సహకరించడంతో నాకు అన్యాయం జరిగింది. అతని వేధింపులు భరించలేక ఎంబీఏ మధ్యలోనే ఆపేశాను. పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటే సంబంధాలు చెడగొడుతున్నాడు. మా ఇంటి ఎదురుగా గాలి మిషన్‌ ఏర్పాటు చేసి నిత్యం మా కుటుంబ సభ్యులను ఈవ్‌టీజింగ్‌ చేస్తున్నాడు. వెంటనే ఆ గాలి మిషన్‌ తొలగించేలా చూడండి.  
– మంత్రి శంకరనారాయణతో బాధిత యువతి ఆవేదన 

మరిన్ని వార్తలు