రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని..

5 May, 2022 07:48 IST|Sakshi
టీడీపీ కార్యకర్తల చేతిలో ధ్వంసమైన షబ్బీర్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం 

వైఎస్సార్‌సీపీ నాయకుడు షబ్బీర్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం, ఇంటిపై దాడి 

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడికి చెందిన ట్రాన్స్‌పోర్టు కార్యాలయం, ఇంటిపై దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం పట్టణంలోని పెన్నా బ్రిడ్జి వంతెన సమీపంలోని మామిడి తోటలో వేణుగోపాల్, వలి, దస్తగిరి అనే ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే తోటలో వారికి సమీపంలోనే టీడీపీ కార్యకర్తలు దుబ్బ జాఫర్, హాజీవలితో పాటు మరికొంత మంది కూడా మద్యం తాగుతున్నారు. ఈ సందర్భంగా హాజీవలి మామిడి కొమ్మలు విరుస్తుండగా వలి అడ్డుపడ్డాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారి తీసింది. ముగ్గురు వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు చితకబాదారు.

అంతటితో ఆగకుండా పలు సందర్భాల్లో వారికి మద్దతుగా ఉంటాడనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు షబ్బీర్‌ అలియాస్‌ గోరాతో గొడవ పడేందుకు ఆయన ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ షబ్బీర్‌ లేకపోవడంతో గుమాస్తాగా పనిచేస్తున్న ఖాజాపై దాడి చేశారు. ఫర్నీచర్, టీవీ,  కంప్యూటర్లు, అద్దాలను పగులగొట్టారు.

అంతేగాక సంజీవనగర్‌లోని షబ్బీర్‌ ఇంటిపైనా రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడా ఆయన లేకపోవడంతో టాటా సఫారీ వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే కాల్వగడ్డలోని సుల్తాన్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపైనా దాడికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ చైతన్య, సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ ధరణీబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన దుబ్బ జాఫర్‌తో పాటు ఫరీద్, దాదు, రహంతుల్లా, ఇలియాస్, హాజీవలితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. 


బాధితుల్ని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి  

బాధితులకు పరామర్శ 
పార్టీ నాయకుడు షబ్బీర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టు కార్యాలయం, నివాసంపై దాడి  విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఫయాజ్‌బాషా తదితరులు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు