-

మత చిచ్చు.. అదే పచ్చ స్కెచ్చు!

18 Jan, 2021 03:48 IST|Sakshi

ఆలయాల విధ్వంసంతో ప్రజల్లో అలజడి రేపే కుట్ర 

కర్నూలు ఘటనలో కేఈ శ్యాంబాబు అనుచరుడు 

రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత కార్యదర్శి 

ఏటిగైరంపేట ఘటనలో టీడీపీ శ్రేణులకు అయ్యన్నపాత్రుడి కొడుకు మద్దతు 

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హడావుడి చేయడంపై పలు అనుమానాలు 

టీడీపీ పక్కా పథకం ప్రకారమే ఎపిసోడ్‌ నడిపినట్టు ఆధారాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు విగ్రహాల విధ్వంసం ఘటనలను తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకున్న తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ ఘటనల్లో టీడీపీ స్కెచ్‌ పక్కాగా అమలైనట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. అందుకు కారణమైన సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సానుకూల ప్రచారం రాకుండా ఉండేందుకే ఆలయ ఘటనలను 

ఆసరాగా తీసుకుని ఆలజడిని రేపుతున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవాలయాల్లో విగ్రహాల ధ్వంస రచనకు పాల్పడటం, పాత ఘటనలను కొత్తగా తెరమీదకు తెచ్చి అలజడి రేపడం, ఎటువంటి ఘటనలు జరగకపోయినా జరిగినట్టు దుష్ప్రచారం చేయడం వంటి చర్యలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైన దురదృష్టకర ఘటన గతేడాది సెపె్టంబర్‌ 5న జరిగింది. ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరిగాయి.

టీడీపీ, బీజేపీలు రంగంలోకి దిగి దేవుడి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మతపరమైన అలజడులను సృష్టించే ప్రయత్నాలు చేయగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అడ్డుకోగలిగారు. అయినప్పటికీ వరుస ఘటనలు జరగడం, వాటిని ఆసరాగా తీసుకుని విపక్షాలు రాద్ధాంతం చేయడం తెలిసిందే. ఇలా సెపె్టంబర్‌ 5 తర్వాత దేవాయాలకు సంబంధించి 44 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 29 కేసులను చేధించిన పోలీసులు 81 మందిని అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ కుట్ర కోణాన్ని గుర్తించారు. తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీలకు చెందిన వారికి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని గుర్తించి, 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా ఘటనల్లో అరెస్టు అయిన వారి పూర్వాపరాలను ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా మరికొన్ని నిజాలను గుర్తించారు.  
 
మద్దమ్మ ఆలయ ఘటనలో నలుగురు టీడీపీ నేతలు 
కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్దమ్మ దేవాలయంలో గతేడాది డిసెంబర్‌ 20వ తేదీన గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటనలో ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిలో ఒక నిందితుడు ఎస్‌డీ ఫక్రుద్దీన్‌ బాషా టీడీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. మరో నిందితుడు రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నల్ల దాసరిపల్లి గ్రామ సర్పంచ్‌ పదవికి టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మరో నిందితుడు కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన జయరాముడు. అతని తల్లి 2019 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున్‌ మద్దతుతో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసింది. మరో నిందితుడు గొల్ల పెద్దయ్య టీడీపీ కార్యకర్త కావడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ కీలక నేతల పాత్రపై ఆరా తీస్తున్నారు.  
 
బుచ్చయ్య డైరెక్షన్‌! 
రాజమండ్రి బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వినాయకుని విగ్రహాన్ని మలినంతో అపవిత్రం చేశారంటూ ఉద్దేశ పూర్వకంగా వివిధ సామాజిక మాధ్యమాలలో టీడీపీకి చెందిన వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి పరీక్ష చేయించడంతో అది జీవ సంబంధ మలినం కాదని రిపోర్టు వచ్చింది. ఈ కేసులో వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబు ఖాన్‌ చౌదరి)ను పోలీసులు అరెస్టు చేశారు. చిటికెన సందీప్‌ (టీడీపీ), అడపా సందీప్‌ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావులు నిందితులుగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన చిటికెన సందీప్‌ టీడీపీ మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరికి వ్యక్తిగత కార్యదర్శి కావడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో ఇదంతా బుచ్చయ్య చౌదరీ డైరెక్షన్‌లోనే జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.  
 
పనిగట్టుకుని దుష్ప్రచారం 
– విశాఖ జిల్లా గోలుగొండ మండలం ఏటిగైరంపేటలో రామాలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ.. గతంలో ఎప్పుడో దెబ్బ తిన్న విగ్రహం తాజాగా దెబ్బతిన్నట్టు సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకుడు పైల సత్తిబాబు, కల్లిద నరేష్లు తప్పుడు ప్రచారం చేయించారు.  
– వారిని అరెస్టు చేసిన క్రమంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి హడావుడి చేశాడు. ఈ ఘటనలో ఆయన పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వినాయకుడి విగ్రహంపై జరిగిన దుష్ప్రచారం వెనుక ఉన్న టీడీపీ నేతలు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.  
– వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండ వేయడం, కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురాన్ని ధ్వంసం చేశారని, ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని, గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేశారంటూ పలు ఘటనల్లో వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతల వెనుక ఉన్న వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. 
– శ్రీకాకుళం జిల్లా సోంపేటలో హనుమంతుని విగ్రహం, ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు జరిగినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వారి వెనకుండి కథ నడిపిన సూత్రధారుల కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తుండటం గమనార్హం.    

మరిన్ని వార్తలు