లబ్ధి నిజం.. దుష్ప్రచారం దుర్మార్గం

5 Dec, 2021 03:33 IST|Sakshi
అధికారుల చేతుల మీదుగా ఓటీఎస్‌ పథకం రసీదు అందుకుంటున్న మందా కోటేష్‌

ఓటీఎస్‌ ద్వారా భారీగా మేలు జరుగుతుందంటున్న లబ్ధిదారులు

ఇన్నాళ్లూ సొంతిల్లు ఉన్నప్పటికీ విలువ లేని వైనం 

యాజమాన్య హక్కులు లేనందున అతి తక్కువ విలువ.. అత్యవసరాల్లో రుణాలు ఇవ్వని బ్యాంకులు 

తెగనమ్ముకుందామంటే లక్షా.. లక్షన్నరో మాత్రమే చేతికి 

ఈ పరిస్థితిని మార్చి విలువ పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం 

సచివాలయాల ద్వారా నామమాత్రపు రుసుముతో ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్‌  

రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌తో ఎన్నో రెట్లు పెరగనున్న విలువ 

రుణాలు తీసుకోవచ్చు.. లేదా మంచి ధరకు అమ్ముకోవచ్చు 

ఈ వాస్తవాలన్నీ విస్మరించి టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం 

అవగాహన కల్పిస్తుండటాన్ని బెదిరింపులుగా చిత్రీకరిస్తున్న వైనం 

సాక్షి, అమరావతి:  గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ములకలూరుకు చెందిన మందా కోటేష్‌కు ప్రభుత్వం 20 ఏళ్ల కిందట ఓ గృహాన్ని మంజూరు చేసింది. ఈ ఇంటిపై రూ.27,400 రుణం ఉంది. అందువల్ల ఇప్పటి వరకు ఈ ఇంటిపై ఇతనికి ఎలాంటి హక్కులు లేవు. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కేవలం రూ.10 వేలు చెల్లించాడు. తద్వారా రూ.17,400 లబ్ధి పొందడమే కాకుండా ఆ ఇంటిపై సర్వ హక్కులు పొందాడు. ఇప్పుడు ఆ ఇంటి విలువ లక్షల రూపాయల్లో పలుకుతుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని కోటేష్‌ చెబుతున్నాడు. ఇదే జిల్లాలోని ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన కమతం మహంకాళమ్మ వ్యవసాయ కూలి. ఈమె కుటుంబం 2004–05లో గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, 2.5 సెంట్లలో 22–ఏ జాబితాలోని నిషేధిత స్థలంలో ఇల్లు నిర్మించుకుంది. ఆ అప్పు వడ్డీతో కలిపి రూ.27,240 అయ్యింది.

ఇప్పుడు ఆమె జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రూ.10 వేలు చెల్లించడంతో ప్రభుత్వం ఆ ఇంటిపై సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. ఈ నెల 8 తర్వాత ఆ ఇంటిని మహంకాళమ్మ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. 21వ తేదీ నుంచి ఆ పత్రాలను పంపిణీ చేస్తారు. అప్పుడు ఆ ఇంటి విలువ రూ.10 లక్షల పైమాటే. వాస్తవానికి 22–ఏ జాబితాలోఉన్న స్థలాలకు విలువ ఉండదు. కానీ ప్రభుత్వం ఆ జాబితా నుంచి ఈ స్థలాన్ని తొలగించి రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల స్థలం విలువ.. ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది.

ఈ పరిణామంతో మహంకాళమ్మ ఆనందానికి అవదులు లేకుండా పోయింది.  ‘ఇక ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో ఇంటిపై రుణం తెచ్చుకోవచ్చు. లేదా అమ్ముకోవచ్చు. పిల్లలకు బహుమతిగా ఇవ్వొచ్చు’ అని సంబరపడుతోంది. ‘ఈ విషయం చాలా మందికి సరిగా తెలియదు. అర్థం అయ్యేలా చెబితే అందరూ ఇలా రిజిస్టర్‌ చేయించుకోవడం ఖాయం. పేదలకు ఇంత మేలు జరిగే ఈ పథకాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారా? అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి అవకాశం రాష్ట్రంలో వెయ్యి కాదు.. లక్ష కాదు.. దాదాపు 50 లక్షల మంది లోగిళ్ల వద్దకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పేదలకు ఇంతగా మేలు జరిగే నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకించే వారిని ఏమనాలి?   
 
గతంలో ఎప్పుడూ లేని విధంగా.. 
► గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి వడ్డీ, అసలులో రాయితీ ఇవ్వడంతో పాటు నిర్మించుకున్న ఇళ్లపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తోంది. 
► రుణాలు పొందకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కేవలం రూ.10 నామమాత్రపు ఫీజుతో ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తోంది. పేదలకు మేలు కలిగే ఏ కార్యక్రమం చేపట్టినా దానిపై కుట్రలు చేసే టీడీపీ, ఎల్లో మీడియా తాజాగా ఈ పథకంపై దుష్ప్రచారానికి తెరతీశాయి. 
► నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, ఇతరత్రా పలు పథకాలపై కోర్టులను తప్పుదోవ పట్టించినట్టుగానే ఈ పథకం పట్ల ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి తాజాగా తెరలేపాయి.   
 
వడ్డీ రాయితీకి బాబు విముఖత 
► గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న వారికి 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద వడ్డీలో రాయితీ ఇస్తూ వస్తున్నాయి. 2014 వరకు పలు మార్లు ఓటీఎస్‌ అమలైంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్‌ అమలు చేయాలని ప్రజాప్రతినిధులు, రుణగ్రస్తుల నుంచి అనేక వినతులు అందాయి. 
► 2016లో గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం ఓటీఎస్‌ అమలుకు తీర్మానం చేయడంతో పాటు, నాలుగు సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయితే పేదలకు వడ్డీ రాయితీ కల్పించడానికి కూడా అప్పటి సీఎం చంద్రబాబుకు మనస్కరించలేదు. దీంతో గృహ నిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయి. 
 
96 శాతం 22–ఏ జాబితాలోని స్థలాలే 
► 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. 2011 ఆగస్టు 15 నాటికి 13 జిల్లాల్లో 51.8 లక్షల మంది రుణం పొంది, రుణం పొందకుండా ఇళ్లు నిర్మించుకున్నారు.  
► వీరిలో 96 శాతం మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్న స్థలాలు 22–ఏ జాబితాలో ఉన్నాయి. కేవలం 4 శాతం మంది ఇళ్లు మాత్రమే రిజిస్ట్రర్‌ స్థలాల్లో ఉన్నాయి.  
► ఈ పరిస్థితిలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం ఓటీఎస్‌ రూపంలో అసలు, వడ్డీ రెండింటికీ రాయితీ ఇవ్వడంతో పాటు.. పేదలకు ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. ఇందు కోసం మామూలుగా అయితే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువపై 7.5 శాతం ఫీజు, చార్జీల రూపంలో మరికొంత ప్రభుత్వానికి చెల్లించాలి. రిజిస్ట్రార్‌ ఆఫీసుల చుట్టూ తిరగాలి. 
► అయితే ఫీజుల భారం, రిజిస్ట్రేషన్, తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, పడిగాపులు లేకుండా నామమాత్రపు రుసుముతో గ్రామ/వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌లు చేయనున్నారు.  
 
అర్హులకు ఇష్టం ఉంటేనే.. 
► రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఓటీఎస్‌ను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఎక్కడా ఒత్తిడి చేయడం లేదు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన పథకం ద్వారా కలిగే ప్రయోజనాన్ని మాత్రమే అధికారులు, సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. స్వచ్ఛందంగా లబ్ధి పొందడానికి ముందుకు వచ్చిన వారికే పథకం వర్తింపజేస్తున్నారు.  
– శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల మంది ఓటీఎస్‌ వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు.     

మరిన్ని వార్తలు