టిడ్కో ఇళ్లపై దుష్ప్రచారం

17 May, 2023 03:38 IST|Sakshi

సీఆర్డీఏ పరిధిలో అన్ని వసతులతో 5,024 ఇళ్లు సిద్ధం 

ఈ నెలాఖరుకల్లా అవి లబ్ధిదారులకు అందజేత 

టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర చరిత్రలో పేదల ప్రగతి కోసం నూరు శాతం పనిచేసే ప్రభుత్వం సీఎం జగనన్నదేనని, ఇది చూసి ఓర్వలేని టీడీపీ.. వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని టిడ్కో గృహాలను మంగళవారం ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు.  

సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో 5,024 టిడ్కో ఇళ్లను అన్ని వసతులతో సిద్ధంచేశామన్నారు. గత ప్రభుత్వం సగం చేసిన పనులను తాము పూర్తిచేశామని, కరోనా కష్టకాలంలో కొన్ని నెలలు పనులు ఆగినా అనంతరం వేగంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాయడం సరికాదని ప్రసన్నకుమార్‌ హితవు పలికారు.  

మంచినీరు లేనిచోట ఇళ్లా!? 
ఇక తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక వసతులు లేకుండా గత ప్రభుత్వం నిర్మాణ పను­లు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వంపై దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడినప్పటికీ అన్ని వసతులు కల్పించి టిడ్కో ఇళ్లను సిద్ధంచేశామన్నారు. నిజానికి.. గత ప్రభుత్వం మంచినీరు దొరకని ప్రదేశాలను టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిందన్నారు.

తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నవులూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో వాటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి నీరు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరున లబ్దిదారులకు అందిస్తామని ఆయన ప్రకటించారు.

పచ్చ మీడియా అసత్య ప్రచారాలు మానుకుని ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలేగాని, ప్రభుత్వ కృషికి ఆటంకంగా నిలువరాదని ప్రసన్నకుమార్‌ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చీఫ్‌ ఇంజినీర్‌ గోపాలకృష్ణారెడ్డి, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు