Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు

25 Jun, 2022 17:06 IST|Sakshi
అమెరికా సంస్థలతో చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న ఎంవోయూలు(ఫైల్‌)  

2016లో 20 అమెరికన్‌ సంస్థలతో ఒప్పందాలన్నీ డొల్లవే! 

స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసమంటూ హడావుడి 

రూ. వేల కోట్లు పెట్టుబడులంటూ బాకా 

ఒక్క రూపాయీ రాని వైనం 

పెట్టుబడుల సదస్సులో టీడీపీ బోగస్‌ ప్రచారం

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తీరు గురివింద గింజను గుర్తుచేస్తోంది.. గత టీడీపీ పాలనలో పెట్టుబడుల సదస్సుల పేరుతో లక్షల కోట్లు తీసుకొచ్చామని బాకా కొట్టి బూటకపు ప్రచారం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వస్తున్న పరిశ్రమల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. విశాఖ వేదికగా నాలుగేళ్లపాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా నగరాభివృద్ధికి 20 అమెరికా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించినా.. ఒక్క కంపెనీ సహకారం తప్ప.. మిగిలిన ఎంవోయూలన్నీ.. డొల్లవేనని స్పష్టమవుతున్నాయి. విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి ఆయా కంపెనీలు పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్లిపోయాయన్నది హాస్యాస్పద ప్రశ్నగా మారిపోయింది. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్ల పాటు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లలో ఏడాదికి రూ.14 లక్షల చొప్పున గణిస్తే.. రమారమి రూ.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్‌ని ముంచెత్తి ఉండాలి. వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సుల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు.  

20 అమెరికా సంస్థల్లో ఒక్కటైనా..? 
దేశంలోనే నంబర్‌ వన్‌ స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటూ 2016లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు బీరాలు పలికారు. అమెరికా అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలను సమర్థంగా అమలు చేసేందుకు భాగస్వామ్య సదస్సులకు హాజరైన అమెరికా బృందంతో చర్చించినట్టు ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా తన పిలుపు మేరకు వైజాగ్‌లో 4వ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తోందని మీడియా సమక్షంలో హడావిడి చేశారు. విశాఖపట్నం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన 20 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా అమెరికన్లతో ఫొటోలు దిగారు. ఇందులో ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోవడం శోచనీయం. 

చదవండి: (CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన ఇలా..)

అయికాం సంస్థది సహకారమే.. 
యూఎస్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీతో ఎంవోయూ చేస్తున్నట్లుగా చంద్రబాబు అండ్‌ కో సంతకాల కోసం ఫోజులిచ్చి.. మీడియాకు విడుదల చేశారు. అమెరికా ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ తరపున స్మార్ట్‌సిటీగా వైజాగ్‌ని అభివృద్ధి చేసేందుకు రూ.వేల కోట్లు నిధులు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన అయికాం, కేపీఎంజీ, ఐబీఎం కంపెనీలు విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తాయని సదస్సులో ప్రకటించారు. ఈ ప్రణాళికల్ని అదే ఏడాది(2016)లోనే అమల్లోకి తెస్తామంటూ చంద్రబాబు ఊదరగొట్టారు.

ఇ–గవర్నెస్, కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో విశాఖను స్మార్ట్‌సిటీగా రూపుదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 వరకూ ఒక్క రూపాయీ ఏ ఒక్క అమెరికా సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎంవోయూ చేసుకున్న తర్వాత.. ఏ ఒక్క సంస్థతోనూ చర్చించినట్లు దాఖలాలు లేవు. ఒక్క అయికాం సంస్థ ప్రతినిధులు మాత్రం పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి.. జీవీఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అందించారే తప్ప.. ఒక్క రూపాయీ విదిలించలేదు. ఇలా.. 20 అమెరికా కంపెనీలు వైజాగ్‌ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయంటూ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని నగర ప్రజలతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు