భీమిలిలో పచ్చపార్టీ మరో శవ రాజకీయం.. టీడీపీ జెండా కప్పి..

7 Jul, 2022 03:50 IST|Sakshi
మాట్లాడుతున్న అప్పలనాయుడు కుమారులు

వైఎస్సార్‌సీపీ నేత అప్పలనాయుడు మరణం నుంచీ లబ్ధి పొందే యత్నం

ఆయన దేహంపై టీడీపీ జెండా కప్పి అంతిమ యాత్ర

ఆయనే కప్పాలని కోరాడంటూ బుకాయింపు

చాలా రోజులుగా మాట్లాడలేని, కదల్లేని స్థితిలో అప్పలనాయుడు

టీడీపీ వారితో ఎలా మాట్లాడారని ప్రశ్నిస్తున్న కుమారులు

భీమునిపట్నం: తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ రాజకీయం చేస్తోంది. గతంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు సహజ మరణాలను సైతం రాజకీయం చేస్తోంది. విశాఖ జిల్లా భీమిలిలో ఇదే విధమైన నాటకానికి తెరతీసి అభాసుపాలైంది. భీమిలికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక నేత అప్పికొండ అప్పలనాయుడు చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా మాట లేదు. సోమవారం మరణించాడు. మంగళవారం అంతిమ యాత్ర సమయంలో టీడీపీ పార్టీ నాయకులు వచ్చి, వైఎస్సార్‌సీపీలో తగిన గౌరవం లేనందున తన అంతిమ యాత్రలో దేహంపై టీడీపీ జెండా కప్పాలని అప్పలనాయుడు కోరాడని చెప్పారు.

కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా జెండా కప్పి ఊరేగించారు. టీడీపీ శవ రాజకీయాన్ని అప్పలనాయుడు కుమారులు అప్పికొండ కృష్ణ, అప్పికొండ కుమార్‌ ఖండించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నాయకుడైన తమ తండ్రి మృతిని టీడీపీవారు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. తమ తండ్రికి, తమకు వైఎస్సార్‌సీపీ అన్నా, సీఎం జగన్‌ అన్నా ఎంతో అభిమానం ఉందని చెప్పారు. ఏమాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్న తమ తండ్రి టీడీపీ వారితో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తమ తండ్రి చెప్పాడంటూ జెండా కప్పడం ఘోరమని అన్నారు.

తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ
టీడీపీ నీచ రాజకీయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ మూడో వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అల్లిపిల్లి నర్శింగరావు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అప్పలనాయుడు మృతదేహంపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు టీడీపీ జెండా కప్పారని చెప్పారు. ఇది ఎంతో హాస్యాస్పదమైందని అన్నారు.

అప్పలనాయుడు చాలా రోజులుగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, అటువంటి వ్యక్తి టీడీపీ నేతలతో ఎలా ఈ విషయాన్ని చెప్పాడని ప్రశ్నించారు. అప్పలనాయుడు వైఎస్పార్‌సీపీకి విధేయుడని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి ఆయన్ని ఎంతగానో అభిమానించేవారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్‌ ఎంపీపీ బోని బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు