మద్యంపై మతిలేని ప్రచారం

22 Aug, 2022 03:43 IST|Sakshi

లిక్కర్‌ పర్చేజ్‌ కార్డులంటూ ఫేక్‌ వీడియోలతో టీడీపీ దుష్ప్రచారం 

ఆ ఉద్దేశమే లేదని స్పష్టం చేసిన బెవరేజస్‌ కార్పొరేషన్‌   

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు విపక్ష టీడీపీ రోజుకో కొత్త కుట్రకు తెర తీస్తోంది. ఇటీవల మార్ఫింగ్‌ వీడియోలు బెడిసికొట్టగా.. ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం ‘లిక్కర్‌ పర్చేజ్‌ ఐడీ కార్డులు’ ప్రవేశపెడుతోందంటూ అసత్యాలతో కూడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. టీవీ వార్త మాదిరిగా భ్రమింపజేసేలా రూపొందించిన ఆ వీడియోను సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి తప్పుదోవ పట్టిస్తోంది. వీడియోలో ఉన్న కథనాన్ని రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఖండించింది. ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగుతుందని పేర్కొంది. 

ఆదాయం కోసమంటూ బురద చల్లుడు.. 
రాష్ట్రంలో మద్యం కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ‘లిక్కర్‌ పర్చేజ్‌ ఐడీ కార్డులు’ ఉండాలనే నిబంధనను  ప్రభుత్వం తెస్తోందని యూట్యూబ్‌ వీడియోలో విపక్షం దుష్ప్రచారం చేస్తోంది. ఏడాది కాలపరిమితితో రూ.5 వేల చొప్పున ఒక్కో కార్డు విక్రయిస్తారని, అది చూపిస్తేనే మద్యం విక్రయిస్తారని, ఆదాయం కోసం ప్రభుత్వం ఈ నిబంధన తెచ్చిందని బురద చల్లుతోంది.  

అది పూర్తిగా ఆవాస్తవం 
‘లిక్కర్‌ పర్చేజ్‌ కార్డులు’ జారీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో దురుద్దేశంతో కూడుకున్నదని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్రమాలు, సిండికేట్లకు తావివ్వకూడదనే మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయాల విధానంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.   

మరిన్ని వార్తలు