కిట్ల పేరిట రూ.కోట్లు కొట్టేశారు, రూ.3 వేలకు 16 వేలు

5 Aug, 2021 04:16 IST|Sakshi

2014–19 మధ్య ఈఎస్‌ఐ కుంభకోణంలో కొత్త కోణాలు

ల్యాబ్‌ కిట్‌ అసలు ధర రూ.3 వేలు.. గత సర్కారు చెల్లించింది రూ.16 వేలు

నిబంధనలకు విరుద్ధంగా రూ.975.79 కోట్ల విలువైన మందులు, పరికరాల కొనుగోళ్లు

మరో నలుగురు కీలక వ్యక్తుల అరెస్ట్‌.. దర్యాప్తును వేగవంతం చేసిన ఏసీబీ

సాక్షి, అమరావతి: అధీకృత డీలర్‌ వద్ద ఓ ల్యాబ్‌ కిట్‌ ధర రూ.3 వేలు. ఆ కిట్‌ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించిన ధర రూ.16వేలు. టీడీపీ హయాంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందుల కొనుగోళ్లలో యథేచ్ఛగా సాగిన అవినీతి బాగోతం ఎంతటిదో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 2014–19 మధ్య ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మొత్తం రూ.975.79 కోట్ల విలువైన మందులు, పరికరాల కొనుగోళ్ల కుంభకోణంపై ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడును గతంలోనే అరెస్ట్‌ చేసిన ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది.

ఆయన  ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఏసీబీ అధికారులు తాజాగా బుధవారం మరో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. వారిలో అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డా.బాల రవికుమార్‌ సైతం ఉండగా.. హైదరాబాద్‌లోని ఓమ్ని మెడి, ఓమ్ని ఎంటర్‌ప్రైజస్‌ యజమాని కంచర్ల శ్రీహరి, ఆయన భార్య, ఓమ్ని హెల్త్‌కేర్‌ యజమాని కంచర్ల సుజాత, ఓమ్ని మెడి మేనేజర్‌ బండి వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకొచ్చారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ నలుగురితో పాటు ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్‌ చేశారు. 

4 షెల్‌ కంపెనీలు.. 400 శాతం అధికంగా..
టీడీపీ ప్రభుత్వంలో పెద్దల అండతో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు పరికరాలు, మందుల కొనుగోలులో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో ఏ–19గా ఉన్న కంచర్ల శ్రీహరిబాబు హైదరాబాద్‌లో ఓమ్ని మెడి పేరుతో ఓ ఫార్మసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. అతనే ఓమ్ని ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో మరో కంపెనీ, తన భార్య సుజాత పేరుతో ఓమ్ని హెల్త్‌కేర్‌ అనే ఇంకో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ మూడు కంపెనీలు హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌తో రిజిస్టర్‌ అయ్యాయి. శ్రీహరిబాబు తన బినామీ కె.కృపాసాగర్‌ రెడ్డి పేరున లేజండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే మరో కంపెనీని కూడా సృష్టించారు. ఈ నాలుగు కంపెనీల మధ్య మందులు, వైద్య పరికరాల వ్యాపారం జరిగినట్టుగా రికార్డుల్లో చూపించి వాటి ధరను ఏకంగా 400 శాతం పెంచేశారు. అనంతరం ఆ పెంచిన ధర ప్రకారం ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు సరఫరా చేశారు. దీనికి అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ బి.రవికుమార్‌ సహకరించారు. ఆ విధంగా కేవలం ఓమ్ని మెడి నుంచి జరిపిన రూ.92 కోట్ల మేర కొనుగోళ్లలో రూ.35 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 

టెండర్లు పిలవకుండా.. నోట్‌ ఫైల్స్‌ సైతం లేకుండా..
టీడీపీ ప్రభుత్వంలో 2014 జూన్‌ నుంచి 2019 మార్చి మధ్యలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా, టెండర్లు లేకుండా ఈఎస్‌ఐ ఆస్పత్రుల కోసం ఏకంగా రూ.975.79 కోట్ల మేర మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సిఫార్సు చేయడంపై దర్యాప్తు ఇప్పటికే కొనసాగుతోంది. మరోవైపు  ఇతర సంస్థల నుంచి కూడా టెండర్లు పిలవకుండానే కనీసం నోట్‌ ఫైళ్లు సైతం లేకుండానే మందులు, వైద్య పరికరాలు, ల్యాబ్‌ కిట్లు, సర్జికల్‌ పరికరాలు, ఫర్నిచర్‌ మొదలైనవి కొన్నారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.

ఆర్థిక శాఖ విధి విధానాలు, ఈఎస్‌ఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాన్‌ రేట్‌ ఫర్మ్‌ నుంచి దాదాపు 50 శాతం అధిక ధరలకు కొనుగోలు చేశారు. డైరెక్టర్లు, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ సిబ్బంది నకిలీ కొటేషన్లు సమర్పించి పోటీ లేకుండా చేశారు. కొందరు తమ బంధువులు, సన్నిహితుల పేరిట సంస్థలను సృష్టించి మరీ వాటి నుంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఇక ల్యాబ్‌ కిట్లు, కన్జూమబుల్స్‌లను కేవలం మూడు సంస్థల నుంచే కొనుగోలు చేశారు. ఆ మూడు సంస్థలు కూడా అధీకృత డీలర్లు కావు. కనీసం అధీకృత డీలర్లతో ఎంవోయూ కూడా చేసుకోని సంస్థల నుంచి మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు