నిబంధనలు పట్టవు.. అనుమతులు ఉండవు

31 Aug, 2021 02:01 IST|Sakshi

ఆరోగ్య ఉప కేంద్రాల్లో టెలి మెడిసిన్‌ హబ్‌ల ఏర్పాటు ప్రాజెక్టులో లీలలెన్నో..

సచివాలయం మొత్తం వెతికినా ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క ఫైలు కూడా దొరకకుండా జాగ్రత్తలు

ప్రభుత్వమే చేయాలని నిబంధనలో ఉన్నా తోసిరాజని ప్రైవేటు సంస్థకు ప్రాజెక్టు అప్పగించిన టీడీపీ సర్కార్‌

ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే పచ్చజెండా

కింది స్థాయి అధికారుల సంతకాలతో తతంగం పూర్తి

ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి ఒక కాంట్రాక్టు ఉద్యోగిని తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలుంటాయి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, మెరిట్, మార్కులు ఇలా అనేక నిబంధనలను సంతృప్తిపరిస్తేనే ఉద్యోగం దక్కుతుంది. అలాంటిది వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఒక ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించేటప్పుడు ఎన్ని నిబంధనలు ఉండాలి.!?.. అలాంటిది ఈ నిబంధనలన్నింటిని తోసిరాజని ఆరోగ్య ఉప కేంద్రాల్లో టెలి మెడిసిన్‌ హబ్‌లను ఏర్పాటు చేసే ప్రాజెక్టును గత చంద్రబాబు ప్రభుత్వం ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సంస్థకు కట్టబెట్టేసింది.

అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సినదాన్ని గోప్యంగా ముగించేసింది. అంతేకాకుండా సచివాలయంలో దీనికి సంబంధించిన ఫైళ్లు కూడా లేకుండా చేయడం వెనుక మతలబు ఏమిటో ఇట్టే తెలుసుకోవచ్చు. గత టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు కొందరు దీని వెనుక ఉండబట్టే ఇంతగా బరితెగించేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సచివాలయంలో చిన్న ఆధారం కూడా దొరకకుండా చేశారంటే గత టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తమ అవినీతి బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

నోట్‌ ఫైల్‌ లేకుండానే ఒప్పందం
ఏదైనా ప్రాజెక్టుకు ఎంవోయూ (అవగాహన ఒప్పందం) చేసుకునే ముందు నోట్‌ ఫైల్‌ రాస్తారు. ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతోపాటు ఈ ప్రాజెక్టు ఎందుకు.. దేని కోసం ఉద్దేశించింది.. ప్రాజెక్టు వ్యయం ఇలా పలు విషయాలను నోట్‌ ఫైల్‌లో క్రోడీకరిస్తారు. అవగాహన ఒప్పందానికి ఇది కీలకమైన సమాచార ఫైల్‌గా భావిస్తారు. కానీ ఇ–సబ్‌ సెంటర్లలో హబ్‌ల ఏర్పాటుకు ఎంవోయూ చేసుకునే సమయంలో కనీసం నోట్‌ ఫైల్‌ కూడా పెట్టలేదు. తాజాగా దీనికి సంబంధించిన ఫైళ్లపై ఆరా తీయగా సచివాలయంలో సైతం కనీసం ఒక్క ఫైలు కూడా లేదు. కుటుంబ సంక్షేమ శాఖలో సైతం ఎలాంటి ఫైళ్లూ లేకుండానే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు.

కింది స్థాయి అధికారులతోనే తతంగమంతా..
వైద్య ఆరోగ్యశాఖలో ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలంటే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ల సంతకాలు తప్పనిసరి. కానీ టెలి హబ్‌ ప్రాజెక్టుకు సంబంధించి కింది స్థాయి అధికారుల సంతకాలతోనే టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తతంగమంతా నడిపించేశారు. ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో చేయించారు. ఎల్‌వోఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌)పై మరో జాయింట్‌ డైరెక్టర్‌తో సంతకం పెట్టించారు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఒకరే ఉన్నారు. కానీ ఆ అధికారి ఎక్కడా సంతకాలు చేయకుండానే కింది స్థాయి అధికారులతోనే చక్రం తిప్పేశారు.

విచారణ చేపట్టిన ప్రభుత్వం
టెలి మెడిసిన్‌ హబ్‌ల మీద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అవగాహన ఒప్పందం, లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌లపై సంతకాలు చేసిన ఇద్దరు అధికారులను ప్రశ్నించింది. ఈ ఇద్దరు అధికారులు కూడా అప్పటి ముఖ్య కార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకే సంతకాలు చేశామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరిలో ఒకరు పదవీ విరమణ చేయగా, మరొకరు వైద్య ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

ముందు ఒప్పందం.. తర్వాత జీవోనా?
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదు. ముందుగా ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఆ తర్వాత జీవో ఇచ్చారు. 2019 జనవరి 12న ధనుష్‌ సంస్థకు ఇస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. జీవో మాత్రం ఫిబ్రవరి 15 ఇచ్చారు. ఇందులో కూడా ప్రైవేటుకు ఇస్తున్నట్టు, టెండర్లు పిలవాలని ఎక్కడా లేదు. నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారుల ద్వారా టెలి మెడిసిన్‌ హబ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వమే చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. కానీ అంతకుముందే ధనుష్‌ ఇన్ఫోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్టును కట్టబెట్టేశారు.

అవినీతి విశ్వరూపం..
► ఆరోగ్య ఉప కేంద్రాలను ఎలక్ట్రానిక్‌ సబ్‌ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నామని మాత్రమే కేబినెట్‌ నోట్‌లో పెట్టారు. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇస్తున్నట్టు గానీ, అంచనా ఎంత అవుతుందని గానీ చెప్పలేదు.
► ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పరిపాలనా అనుమతులు లేవు.
► జీవో నంబర్‌ 39లో కూడా ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారానే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రైవేటుకు ఇస్తున్నట్టు చెప్పలేదు.
► ధనుష్‌ ఇన్ఫోటెక్‌ సంస్థకు బిల్లులు చెల్లించాలని సచివాలయానికి ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో ఏ జీవో నంబర్‌ ద్వారా టెండరు ఇచ్చారో పేర్కొనాల్సి ఉండగా అలా ఏమీ చేయలేదు.  

మరిన్ని వార్తలు