తిరుపతి వెళ్తున్న బస్సుపై టీడీపీ గూండాల దాడి 

8 Jul, 2022 06:06 IST|Sakshi
బస్సులోని ప్రయాణికులను వదిలిపెట్టాలని టీడీపీ గూండాలను వేడుకుంటున్న బస్సు డ్రైవర్‌

చంద్రబాబు పర్యటనలో టీడీపీ గూండాగిరీ 

ఎ రంగంపేట వద్ద గంటల తరబడి రోడ్డుపై వాహనాలు నిలిపివేత  

చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ నేతల గూండాయిజానికి ఇది మరో ఉదాహరణ. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సాకుతో తిరుపతికి వచ్చే వేలాది ప్రయాణికులను నిలిపివేయడమే కాకుండా, ఇదేమని ప్రశ్నించినందుకు ఓ బస్సుపై దాడి చేసి, అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో గురువారం రాత్రి ఈ దాడి జరిగింది.

ప్రయాణికుల కథనం ప్రకారం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మినీ మహానాడు కార్యక్రమానికి మదనపల్లె నుంచి ఏ.రంగంపేట మీదుగా  తిరుపతి, నగరికి వెళ్తున్నారు. ఏ.రంగంపేట వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గురువారం రాత్రి ఆ పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వస్తున్నారంటూ తిరుపతికి వచ్చే ప్రయాణికుల వాహనాలను అడ్డుకున్నారు. గంటకు పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎందుకు ఆపివేశారని తిరుపతికి వస్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు టీడీపీ నేతలను ప్రశ్నించారు. తాము వెంటనే తిరుపతికి వెళ్లాల్సి ఉందని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు బస్సుపై దాడి చేశారు. ఓ ప్రయాణికుడి పైనా దాడి చేశారు. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉండడంతో వారిని కాపాడేందుకు బస్సు డ్రైవరు రెండు చేతులెత్తి టీడీపీ వారిని వేడుకొన్నారు.

అయినా టీడీపీ వర్గీయులు ససేమిరా అన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిపై రౌడీ షీట్‌ ఉన్నట్లు టీడీపీ నేతలు కొందరు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ ఓబులేసు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  దాడికి పాల్పడిన రౌడీ మూకలను చెల్లాచెదురు చేసి బస్సును తిరుపతికి పంపించారు. 

మరిన్ని వార్తలు