ఆస్పత్రుల సందర్శనలో టీడీపీ హైడ్రామా

25 May, 2021 04:27 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చొచ్చుకెళ్లే యత్నాలు 

రోగులపై శ్రద్ధ కంటే రాజకీయ మైలేజీపైనే టీడీపీ నేతల ఫోకస్‌ 

తప్పనిసరి పరిస్థితుల్లో పలువురిని హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, అమరావతి:  కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సందర్శన పేరుతో టీడీపీ హైడ్రామాకు తెరలేపింది. రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు సోమవారం హంగామా చేశారు. కరోనా రోగులపై శ్రద్ధ కంటే రాజకీయ మైలేజీపైనే నేతలు దృష్టి పెట్టారు. ‘కోవిడ్‌ బాధితులకు భరోసా’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వారు ఉత్సాహం చూపారు. కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కరోనా ఆస్పత్రుల్లో వారంతా పెద్ద సంఖ్యలో పర్యటనలు చేస్తే వైరస్‌ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు వారించినా ఆస్పత్రి సందర్శనకు పట్టుబట్టారు. కోవిడ్‌ ఆస్పత్రిల్లో వైద్య సేవలు, బెడ్‌లు, ఆక్సిజన్‌ తదితర వాటిని స్వయంగా పరిశీలిస్తామంటూ వాగ్వాదానికి దిగారు.

ఒక్కసారి ఎక్కువ మంది అలా ఆస్పత్రుల్లోకి చొచ్చుకెళ్తే అటు కరోనా రోగులకు అసౌకర్యంతోపాటు ఇటు నేతలు, కార్యకర్తలకూ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో పోలీసులతో టీడీపీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ఆస్పత్రుల సందర్శనకు అనుమతి నిరాకరించిన పోలీసులు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను తప్పనిసరి పరిస్థితుల్లో గృహ నిర్బంధం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వైవీ రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు, బీటెక్‌ రవి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

పలు ప్రాంతాల్లో మాత్రం టీడీపీ నేతలు ఆస్పత్రులను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుíప్పించారు. టీడీపీ నేతల గృహ నిర్బంధంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేష్‌ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కరోనా రోగులకు ధైర్యం చెప్పి ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స, సౌకర్యాలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులు వెళ్తే అడ్డుకోవటం సరికాదని వారు పేర్కొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు