అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు

2 Dec, 2022 10:37 IST|Sakshi

దుష్ట శక్తులన్నీ గుంపులుగా చేరడం సహజం. ఇప్పుడు అనంతపురంలో అదే జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం రాజకీయ పార్టీల విధి. ప్రత్యర్థులైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోరు. కాని ఏపీలో పచ్చ పార్టీ, దత్తపుత్రుడి పార్టీ, జాతీయ పార్టీ ముసుగేసుకున్న ఒక పచ్చ నేత కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు.

రోడ్డు.. మోకాలడ్డు.!
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనంతపురం నగర అభివృద్ధిపై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించడంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతపురం అర్బన్ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. 300 కోట్ల రూపాయల ఖర్చుతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా నిర్మితమవుతున్న ఓ జాతీయ రహదారి అనంతపురం నగరం మీదుగా వెళ్తోంది. ఈ రోడ్డు పనుల్ని ఆపేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు ఏకమయ్యారు.

ఆక్రమిస్తాం.. కేసులేస్తాం.!
ప్రస్తుతం బీజేపీ నేతగా చెలామణి అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ లకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణలో భాగంగా సగానికి సగం వెళ్లిపోతాయి. జాతీయ రహదారి స్థలాన్ని ఆక్రమించి ఈ ఇద్దరు నేతలు అతిపెద్ద భవనాలను నిర్మించి కొన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయలు లబ్ది పొందుతున్నారు.

ఆక్రమ కట్టడాలు తొలగించాలని, లేకపోతే తామే కూల్చేస్తామని వరదాపురం సూరీ, టీసీ వరుణ్‌లకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఎలాగైనా రోడ్డు విస్తరణ పనులను ఆపేయాలని ఆ ఇద్దరు ఎత్తుగడ వేశారు. కోర్టుల్లో ఇప్పటిదాకా 22 కేసులు వేశారు. రోడ్డు నిర్మాణం సరిగా జరగటం లేదంటూ ఎల్లో మీడియా ద్వారా వక్రీకరణ కథనాలు రాయిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా వీరితో జతకట్టినట్లు సమాచారం.

బండారం బట్టబయలు
పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్‌ను కలిపే రహదారి పూర్తయితే అనంతపురం నగరం రూపురేఖలు మారిపోతాయి. ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మంచి పేరు వస్తుందన్న అభద్రతా భావం విపక్ష నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి, బీజేపీ నేత వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ సంయుక్తంగా అనంతపురం అభివృద్ధిపై కుట్రలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి రోడ్డు విస్తరణలో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీంకు చెందిన నీమా ఆప్టికల్స్ కూడా పోతుంది. ఆయన షాపు పూర్తిగా తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మేయర్ మహమ్మద్ వాసీం యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తున్నారు.

నగర మేయర్‌తో పాటు చాలా మంది వైఎస్సార్ సీపీ నేతలు.. మద్దతుదారులు రోడ్డు విస్తరణలో భాగంగా తమ భవనాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరి స్ఫూర్తి టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్లో ఎందుకు కనిపించడంలేదని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాల కంటే.. అనంతపురం నగర అభివృద్ధి కంటే.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాకులాడటం పట్ల అనంత వాసులు భగ్గుమంటున్నారు.

పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు