మీసం మెలేసి.. చెప్పులు విసిరి 

19 Oct, 2022 03:26 IST|Sakshi
రాజమహేంద్రవరంలో నిరసన తెలుపుతున్న ప్రజలను రెచ్చగొడుతున్న అమరావతి యాత్రికులు

రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన శ్రేణుల బీభత్సం 

అమరావతి యాత్రను ఆపేదెవరూ అంటూ పాటల ద్వారా అడుగడుగునా కవ్వింపు  

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై దాడి.. ఇద్దరికి గాయాలు 

ప్రతిఘటించిన స్థానికులు

ఆజాద్‌ చౌక్‌ వద్ద ఉద్రిక్తత 

సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన నేతలు రాజమహేంద్రవరంలో బీభత్సం సృష్టించారు. వికేంద్రీకరణకు మద్దతుగా శాంతియుతంగా సభ నిర్వహించి నిరసన వ్యక్తంచేస్తున్న స్థానికులపై ఆ పార్టీల శ్రేణులు విరుచుకుపడ్డారు. మీసం మెలేసి మరీ రెచ్చగొట్టారు. ‘యాత్రను ఆపేదెవరు’ అంటూ పాటలు పెట్టుకుని మరీ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

వాటర్‌ ప్యాకెట్లు, చెప్పులు విసిరి రౌడీయిజానికి తెర తీశారు. రాళ్ల దాడికీ తెగబడ్డారు. మురికినీళ్ల బాటిళ్లు విసిరారు. అప్పటివరకు సహనంగా ఉన్న స్థానికులు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో నగరంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించింది. దేవీచౌక్‌ మీదుగా ఆజాద్‌ చౌక్‌ వద్దకు యాత్ర చేరుకుంది. అప్పటికే ఆజాద్‌ చౌక్‌ వద్ద యాత్ర వెళ్లే ప్రాంతానికి కొంతదూరంలో వికేంద్రీకరణకు మద్దతుగా స్థానికులు శాంతియుతంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ఆజాద్‌ చౌక్‌ వద్దకు చేరుకోగానే స్థానికులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు.

‘వికేంద్రీకరణ ముద్దు.. ఒకే రాజధాని వద్దు’ అని నినదించారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన అమరావతి పాదయాత్రలోని కొందరు టీడీపీ, జనసేన నేతలు యాత్ర వెంట తెచ్చుకున్న వాటర్‌ ప్యాకెట్లను స్థానికులపైకి విసిరారు.

మీసం మెలేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక వాహనాన్ని అక్కడ నిలిపి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేక పాటలతో హోరెత్తించారు. బాణాసంచా కాలుస్తూ హంగామా సృష్టించారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. యాత్ర ముసుగులో వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లు, చెప్పులు విసురుతున్న వాటిని పట్టుకుని తిరిగి వాళ్లపైకి విసిరారు.

టీడీపీ బినామీలు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఇలా సుమారు గంటపాటు ప్రతిఘటన ఎదురైంది. అక్కడే ఉన్న టీడీపీ రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సైతం దాడిని ప్రోత్సహించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కలగజేసుకుని పాదయాత్రను ముందుకు కదలనివ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.  

ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలు.. 
మరోవైపు.. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు జరిపిన రాళ్ల దాడిలో కొండా సాయి, కె. నూకరాజు అనే వ్యక్తులకు తలపై, ఎడమ కంటి వద్ద బలమైన గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ మార్గాని భరత్‌ వైద్యులకు సూచించారు.

రాజమహేంద్రవరం చరిత్రలో ఇది చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. అలాగే, దాడిని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు దాడిని ఖండించారు. 

మరిన్ని వార్తలు