బాబు బరితెగింపు

4 Jan, 2023 03:47 IST|Sakshi
కెనుమాకలపల్లిలో చంద్రబాబు సభ కోసం గుడి ముందు ఏర్పాటు చేసిన వేదిక

ఐదు రోజుల్లో 11 మంది మృతిచెందినా మారని తీరు 

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన 

పలమనేరు డివిజన్‌లో నవంబరు నుంచి అమలులో ఉన్న 30 పోలీస్‌ యాక్ట్‌ 

తాజాగా రోడ్లపై సభలు, రోడ్‌షోలను నిషేధించిన ప్రభుత్వం 

ప్రజల భద్రత కోసం నిర్ణయం 

అయినాసరే నాలుగు రోడ్‌ షోలతో చంద్రబాబు పర్యటన 

నోటీసులు జారీచేసిన చిత్తూరు పోలీసులు.. దానికి ఇంకా సమాధానమివ్వని టీడీపీ

పోలీసుల అనుమతి నిరాకరణ

ప్రజల భద్రతకు విఘాతం కల్గించాలన్నదే టీడీపీ పన్నాగం! 

సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్‌/కుప్పం: తన ప్రచారార్భాటం ప్రజల ప్రాణాలు హరిస్తున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు ఏమాత్రం మారడంలేదు. లేని జనాదరణను ఉన్న­ట్లుగా చూపించేందుకు ఆయన వేస్తున్న చీప్‌ట్రిక్స్‌తో కేవలం ఐదురోజుల వ్యవధిలోనే 11 మంది మరణించినా.. ఇంకా ఎంతోమంది గాయపడినా సరే 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు మనసు కరగడంలేదు. ప్రజల భద్రత కోసం రోడ్లపై సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసినా సరే ఆయన బేఖా­తరు చేస్తున్నారు. నిజానికి.. శాంతిభద్రతల దృష్ట్యా చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్‌ పరిధిలో కొన్ని నెలలుగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నాసరే పట్టించుకోవడంలేదు.

చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కుప్పంలో మూడ్రోజుల పర్యటన షెడ్యూల్‌ను ఖరారుచేశారు. అలాగే, ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించాలన్న పోలీసుల నోటీసుపైనా స్పందించలేదు. మూడ్రోజుల్లో నాలుగు రోడ్‌షోల నిర్వహణకు సిద్ధపడుతుండటం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి శాంతిభద్రతల విఘాతానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నుతున్నారన్నది వారి చర్యలుబట్టి స్పష్టమవుతోంది.  
 
జీఓ బేఖాతరు.. ఐదు రోడ్‌షోలతో పర్యటన 
ఇక చంద్రబాబు బుధ, గురు, శుక్రవారాల్లో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను ఆయన ప్రైవేటు కార్యదర్శి మంగళవారం విడుదల చేశారు. దాని ప్రకారం.. చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు చేరుకుని రోడ్డు మార్గంలో కుప్పం వెళ్తారు. మొదటిరోజు శాంతిపురం మండలంలోని పెద్దూరు, బెండనకుప్పం, చెంగుబల్ల క్రాస్, శివకురుబూరు, శెట్టిబల్ల క్రాస్, కెనమాకులపల్లి, శాంతిపురంలలో రోడ్‌షోలు నిర్వహిస్తారు.

రెండోరోజు గురువారం కుప్పంలో పార్టీ కార్యాలయంలో నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. శుక్రవారం ఏకంగా మూడురోడ్‌షోలు నిర్వహిస్తారు. గుడుపల్లి మండలంలోని గుడుపల్లి, గుడుపల్లి రైల్వేస్టేషన్‌ క్రాస్, పెద్ద గొల్లపల్లి క్రాస్, చిన్నగొల్లపల్లి క్రాస్, కొడిగనిపల్లి, మాలవాని కొత్తూరు, సంగనపల్లి, పెద్దపర్తికుంట క్రాస్‌ల మీదుగా మూడు విడతల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో గత ఏడాది నవంబరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసులు పలమనేరు డివిజన్‌లో విధించిన 30 పోలీస్‌ యాక్ట్‌ అప్పటి నుంచి అమలులోనే ఉంది. ఆ ప్రకారం ముందస్తు అనుమతిలేకుండా ఎలాంటి సభలు నిర్వహించకూడదు. ఈ నేపథ్యంలో.. మొన్న డిసెంబరు 28న నెల్లూరు జిల్లా కందుకూరులో  చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు.

అలాగే, జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు పేద మహిళలు మృతిచెందారు. ఈ రెండు ఘటనల్లోనూ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతిరాజ్‌ రోడ్లపై సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం జీఓ జారీచేసింది.

రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని కూడా స్పష్టంచేసింది. అయినా 30 పోలీస్‌ యాక్ట్, హోంశాఖ జీఓలను బేఖాతరు చేస్తూ కుప్పంలో ఐదు రోడ్‌ షోలతో చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది.  
 
నోటీసులకు స్పందించని టీడీపీ.. 
చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం టీడీపీకి నోటీసులు జారీచేశారు. 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉండటంతోపాటు రోడ్లపై సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓను ఆ నోటీసుల్లో ఉటంకించారు. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించారు.

అలా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభల కోసం దరఖాస్తు చేస్తే అనుమతిస్తామని.. పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్పారు. కాబట్టి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేయాలని చెబుతూ నోటీసులు జారీచేశారు. కానీ, పోలీసుల నోటీసులపై టీడీపీ మంగళవారం రాత్రి వరకు స్పందించలేదు. నోటీసులకు సమాధానం కూడా ఇవ్వలేదు.

అంటే పోలీసులతో ఉద్దేశపూర్వకంగా ఘర్షణ వైఖరిని టీడీపీ కోరుకుంటోందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అనుమతిలేకుండా, జీఓకు విరుద్ధంగా రోడ్‌ షో నిర్వహిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం జారీచేసిన జీఓను అమలుచేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఇదే సాకుగా చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలన్నది టీడీపీ ఉద్దేశంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  
 
టీడీపీకి నోటీసులు జారీచేశాం 
పలమనేరు డివిజన్‌లో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంది. రోడ్లపై సభలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేయాలని సూచిస్తూ టీడీపీకి నోటీసులు జారీచేశాం. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభల ఏర్పాటుకు అనుమతి కోరితే పూర్తిగా సహకరిస్తామని చెప్పాం. ఇప్పటివరకు టీడీపీ సమాధానం ఇవ్వలేదు. ప్రజల భద్రత కోసం చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకు సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. 
– రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా 

మరిన్ని వార్తలు