20 ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్‌.. కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేత

5 May, 2021 08:21 IST|Sakshi
పట్టుబడిన టీడీపీ నేత పద్మనాభరాజుకు చెందిన రేషన్‌ బియ్యం లారీ 

టర్బో లారీ సహా 10 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

20 ఏళ్లుగా సొంత రైస్‌మిల్లు, లారీలతో పక్క రాష్ట్రాలకు రేషన్‌ బియ్యం

పోలీసుల అదుపులో ఇద్దరు 

సాక్షి, తిరుపతి : టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజు అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పిచ్చాటూరు ఎస్‌ఐ వంశీధర్‌ కథనం మేరకు.. పద్మనాభరాజుకు చెందిన లారీల ద్వారా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని జిల్లా ఎస్‌పీ రిషాంత్‌ రెడ్డికి సమాచారం అందింది. దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు రెండు బృందాలుగా దాడులకు దిగారు. ఒక బృందం పిచ్చాటూరులో, మరో బృందం నాగలాపురంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై మఫ్టీలో కాపు కాచింది. మంగళవారం వేకువ జామున 3.30 గంటలకు కీళపూడిలోని పద్మనాభరాజు రైస్‌ మిల్లు నుంచి 10.50 టన్నుల రేషన్‌ బియ్యంతో లారీ చెన్నై వైపు బయలు దేరింది.

మార్గ మధ్యంలో అడవి కొడియంబేడు వద్దకు లారీ చేరుకోగానే మాటు వేసిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సినీ ఫక్కీలో లారీని అడ్డుకున్నారు. డ్రైవర్‌ దిగి పరారయ్యాడు. లారీని తనిఖీ చేయగా అందులో 10.50 టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం సహా లారీని స్టేషన్‌కు తరలించి స్థానిక ఎస్‌ఐ వంశీధర్‌కు అప్పగించారు. బియ్యం అక్రమ రవాణాపై డ్రైవర్‌ తంగరాజ్, టీడీపీ నేత పద్మనాభరాజు సొంత తమ్ముడు కొడుకు వినయ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బియ్యం సహా టర్బో లారీని స్థానిక సివిల్‌ సప్లయిస్‌ డీటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. 

స్మగ్లర్‌ పద్మనాభరాజుపై ఎన్నో కేసులు 
పద్మనాభరాజు రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడని, స్మగ్లర్‌గా పలు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇరవై ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్‌ వృత్తిగా రూ.కోట్లకు పడగలెత్తాడు. 2010లో బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి చర్లపల్లిలో జైలు శిక్ష అనుభవించాడు. అప్పట్లో రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనుకున్నాడు. వెంటనే తన వృత్తికి అనుకూలంగా ఉన్న టీడీపీలో చేరాడు. ఆ తరువాత టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా తన భార్యను నిలబెట్టి బియ్యం స్మగ్లింగ్‌ డబ్బులతో గెలిపించుకున్నాడు.

అప్పటి నుంచి బియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో యథేచ్ఛగా దందాను సాగించాడు. 2018లో టీడీపీ నేతలే అక్రమ బియ్యం రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి పట్టివ్వడం గమనార్హం. రెండునెలల కిందట పిచ్చాటూరు లోని దుకాణంలో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు