కళా వెంకటరావు చీప్‌ పాలిట్రిక్స్‌ ..

28 Jul, 2021 17:55 IST|Sakshi

డ్రామా పేరు ధర్నా. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కళా వెంకటరావు. విడుదల ఈ నెల 28. ఉనికి చాటుకునే ప్రయత్నంలో కళా వెంకటరావు నానాటికీ దిగజారిపోతున్నారు. 30వ తేదీకి తోటపల్లి నీరు శివారుకు అందుతుందని అధికారులు చెబుతుంటే.. 28వ తేదీకే నీటి కోసం ధర్నాకు దిగుతున్నారు! ఈ డ్రామా కోసం మళ్లీ జనాలకు పిలుపు కూడా ఇచ్చారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం కళా ఇచ్చిన పిలుపుపై జనం నవ్వుతున్నారు.   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళా వెంకటరావు టీడీపీ లో తానొకడిని ఉన్నానని చెప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా తోటపల్లి నీటి విషయమై కొత్త ఎత్తుగడ వేశారు. అంతరార్థం జనాలకు తెలిసిపోవడంతో ఆయన ప్రయత్నాలు చూసి తోటి టీడీపీ శ్రేణులే జాలి పడుతున్నాయి

కళా రాజకీయమిది.. 
అధికారులు తీసుకున్న చర్యలు, చెప్పిన విష యాన్ని పక్కన పెట్టి కిమిడి కళా వెంకటరావు జల రాజకీయం చేసేందుకు పూనుకున్నారు. మిగిలిన(జాతీయ రహదారి దాటాక ఉన్న) కాలువలకు ఈనెల 30న నీరు విడుదల చేస్తా మని ఇరిగేషన్‌ అధికారులు స్వయంగా చెప్పినప్పటికీ 28న రణస్థలంలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్టు ఇప్పటికే నీరు విడుదల చేసి, 30వ తేదీన శివారు భూములకు నీరిచ్చేందుకు షెడ్యూల్‌ ప్రకటించాక కళా వెంకటరావు ఆందోళన దిగుతుండడం హాస్యాస్పదంగా మారింది.

వాస్తవమిది.. 
తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నెల 21న శ్రీకాకుళం బ్రాంచి కాలువకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 20 కిలోమీటర్ల పొడవు గల కాలువలో 17వ కిలోమీటర్‌ కమ్మ సిగడాం వద్దకి ప్రస్తుతం నీరు చేరింది. జాతీయ రహదారి దాటాక ఉన్న మిగతా 3 కిలోమీటర్ల కాలువలో కమాండ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా కింద వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో నీరు విడిచి పెట్టలేదు. 32ఎల్‌ (ఎడమ కాలువ) వెళ్లే కోష్ట, పైడిభీమవరం వైపు, 33ఆర్‌(కుడికాలువ)వెళ్లే రావాడ, రణస్థలం వైపు నీరు ప్రస్తుతం వెళ్లడం లేదు. పనులు చేపట్టిన చోట నీరు విడుదల చేస్తే వృధా తప్ప ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు(30వ తేదీకి)కు నీరు విడిచి పెట్టాలని అధికారులు నిర్ణయించారు.ఈ లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు వచ్చాయి. ఇదే విషయాన్ని సాగునీటి కోసం నాలుగు రోజుల కిందట వారికి ఫోన్‌ చేసిన టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు ఇరిగేషన్‌ అధికారులు స్పష్టం చేశారు.

కలిశెట్టి ఆనందమిది.. 
రణస్థలం మండలంలోకి తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల చేయడంపై టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు రైతులతో కలిసి దేవరాపల్లి గ్రామ సరిహద్దులో ఉన్న తోటపల్లి కాలువను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకా రం అధికారులు తోటపల్లి నీరు విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. అయినా కళా వెంకటరావు మాత్రం తన ఉనికి చాటుకునేందుకు అర్థం లేని ఆందోళనలకు దిగుతున్నారు. నీటి విడుదల షెడ్యూల్‌ జనాలకు తెలిశాక కూడా ఆందోళనకు దిగుతున్నారు.

తన ఖాతాలో వేసుకునేందుకు.. 
ఎలాగూ రెండు రోజుల్లో నీరు విడుదలవుతుంది. అదంతా తన గొప్పతనమే అని చెప్పుకునేందుకు ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. రణస్థలం మండలానికి ఇప్పటికే నీరు విడుదల చేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తోటి టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు కాలువ వద్దకు వెళ్లి హర్షం వ్యక్తం చేస్తుంటే కళా వెంకటరావు ఇప్పుడు సాగునీటి కోసమని ధర్నా చేయడమేంటని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం కళా పరిస్థితి కళావిహీనంగా మారింది. తన కొడుకును ఎంత ప్రమోట్‌ చేసినా లాభం లేకపోయింది. కార్యకర్తలు ఆశించిన స్థాయిలో దగ్గరకు చేరడం లేదు. దీంతో ఈ కొత్త ఎత్తుగడకు తెరతీశారు.    

మరిన్ని వార్తలు