నల్లారి వారి ‘భూ మాయ’: ఎక్కడ దొరికితే అక్కడే..

23 Jul, 2021 16:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో అధికారం దన్నుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి భూదందాలకు లెక్కలేకుండా పోయింది. ఆయన అనుచరులు చెట్టు, పుట్ట, గుట్ట, వాగు, వంక, దేవుడిమాన్యం అనే తేడా లేకుండా ఏది కంటికి కనబడితే అది బినామీ పేర్లతో స్వాహా చేసేశారు. పీలేరు పట్టణంతో పాటు బోడుమల్లువారిపల్లె, ముడుపులవేముల, గూడరేవుపల్లె, యర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు పంచాయతీలలో ప్రభుత్వ భూములు టీడీపీ నేతల పరమయ్యాయి.

► అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలోనే నేరుగా పీలేరులో జరుగుతున్న భూదందా లను ప్రస్తావించారు. ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో అసెంబ్లీలో అధికారపక్షం సమాధానమిస్తూ కేవలం ఏడెకరాల భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని స్పష్టం చేసింది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసిన పక్కా లెక్కల్లో వందల ఎకరాల భూములు ఆక్రమణల చెర నుంచి బయటపడ్డాయి. వాటిల్లో కొన్ని భూములను పేదల ఇళ్లకు ప్రభుత్వం కేటాయించింది. అదే ఇప్పుడు టీడీడీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో నల్లారి బ్యాచ్‌ ఎదురుదాడికి దిగుతోంది. కానీ వాస్తవాలు ఇలా ఉన్నాయి. 

పీలేరు మండలం గూడరేవుపల్లె సర్వేనంబరు 198 లో 106.86 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమి గతంలో ఆక్రమణకు గురైంది. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జగనన్న కాలనీలకు కేటాయించింది. 

 ► పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలో సర్వే నంబర్‌ 906లో 23ఎకరాలు, సర్వేనంబరు 908లో 10.14ఎకరాలు, 909/2లో 96సెంట్ల భూమి అన్యాక్రాంతమైంది.  ప్రస్తుత ప్రభుత్వం వీటిల్లో కూడా చాలా వరకు ఆక్రమణలు తొలగించింది. 

ఇంకా ఇప్పటికీ  నల్లారి అండ్‌ కో ఆదీనంలోనే.. 
  పీలేరు మండలం  దొడ్డిపల్లె, కాకులారంపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో గతంలో ఇందిరమ్మ గృహాల కోసం సుమారు 90ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2,322 ప్లాట్లు ఏర్పాటు చేశారు. అయితే 1,750మందికి మాత్రమే ఇచ్చి మిగిలిన 572 పట్టాలు,  6.80ఎకరాల భూమిని ఇప్పటికీ టీడీపీ నేతలు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అదేవిధంగా సర్వేనంబరు 1136/1లో 10.32ఎకరాల ప్రభుత్వ భూమి నల్లారి అనుచరుల ఆక్రమణలో ఉందని అక్కడ ఎవరినడిగినా చెబుతారు.
 ► పీలేరు పట్టణంలోని బోడుమల్లువారిపల్లి, నాగిరెడ్డి కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీల్లో అప్పట్లో  నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి అండతో ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందే. 

 అప్పట్లో అసైన్‌మెంట్‌ ఆమోదం లేకుండానే పీలేరు మండలంలో డీకేటీ పట్టాలను సొంతం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం డీకేటీ పట్టాలు జారీ చేస్తే అందుకు సంబంధించిన వివరాలను ఏ రిజిష్టరులో నమోదు చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా అడ్డగోలుగా డీకేటీ భూములు పంచేసుకున్నారు. 

  అదే విధంగా అప్పట్లో కలికిరిలో సర్వే నంబర్‌ 547–ఎ, 549 –2ఎ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండానే లే అవుట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకున్నారు.  

మరిన్ని వార్తలు