లోకేశ్‌ ప్రచారం.. డబ్బు పంపిణీ.. 

13 Nov, 2021 06:36 IST|Sakshi

సాక్షి, తిరుపతి: కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయం వెన్నాడుతుండటంతో తెలుగుదేశం నేతలు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఎలాగైనా కుప్పంలో గెలవాలని చంద్రబాబు, లోకేశ్‌.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్‌ సమయం సమీపిస్తుండడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడే కుప్పంలో ప్రచారానికి రాకుండా గెలిచిన చంద్రబాబు.. ఇప్పుడు మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

శుక్రవారం లోకేశ్‌ ప్రచారం చేస్తున్నారు. లోకేశ్‌ గురువారం రాత్రి డబ్బు సంచులతో కుప్పం చేరుకున్నారనే ప్రచారం సాగుతోంది. లోకేశ్‌ వచ్చిన గంట తరువాత డబ్బుల పంపిణీ మొదలుపెట్టారు. ఓటర్ల బంధువులు, మహిళల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే సమయంలో ఒకరు ఇంట్లోకి వెళ్లి మరొకరు బయట కాపలా ఉంటున్నారు. లోనికి వెళ్లిన వ్యక్తి.. మహిళల చేతిలో డబ్బులు పెట్టి ప్రమాణం చేయించుకుని వస్తున్నారు.

శుక్రవారం లోకేశ్‌ ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు నగదు పంపిణీ చేపట్టారు. పోలీసులు లోకేశ్‌ ప్రచారం వైపే ఉంటారు కాబట్టి మరోవైపు ఇళ్లకు వెళ్లి డబ్బు అందజేస్తున్నారు. ఓటరు టీడీపీ సానుభూతిపరులైతే రూ.2 వేలు, మిగతావారైతే రూ.5 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇచ్చేస్తున్నారు. కొందరికి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా బదిలీ చేస్తున్నారు. 

విచ్చలవిడిగా మద్యం పంపిణీ 
కుప్పంలో కర్ణాటక మద్యం పంపిణీ చేయాలని టీడీపీ నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా మద్యం తెప్పించి పంపిణీ చేశారు. గురువారం రాత్రి రాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటక పరిధిలో ఉన్న దుకాణాల ద్వారా భారీగా కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులే చెబుతున్నారు.

బెంగళూరులో స్థిరపడిన టీడీపీ ముఖ్యనేతలు కర్ణాటక సరిహద్దులో ఉండే మద్యం దుకాణాలను బినామీ పేర్లతో దక్కించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఆరు మద్యం దుకాణాలుంటే, సరిహద్దులో కర్ణాటక పరిధిలో తొమ్మిది దుకాణాలున్నాయి. ఆ మద్యం దుకాణాల పరిసరాల్లో ఒక్క గ్రామం కూడా లేకపోవడం గమనార్హం.     

మరిన్ని వార్తలు