డ్రెయిన్‌లోకి లోకేశ్‌ ట్రాక్టర్‌

27 Oct, 2020 02:40 IST|Sakshi
అదుపుతప్పి డ్రెయిన్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

‘పశ్చిమ’ పర్యటనలో అపశృతి.. అంతా క్షేమం 

నారా లోకేశ్‌పై సుమోటోగా కేసు నమోదు

ఆకివీడు (పశ్చిమ గోదావరి): టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం అపశృతి చోటుచేసుకుంది. ఆకివీడు నుంచి లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ వెళుతుండగా.. సిద్ధాపురం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న చినకాపవరం డ్రెయిన్‌లోకి దూసుకుపోయింది. స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఆపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సిద్ధాపురంలో లోకేశ్‌ పర్యటించారు. 

పోలవరం నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు 
అంతకుముందు ఆకివీడులో విలేకరుల సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని కుదించడం దురదృష్టకరమన్నారు. రూ.55 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం మారిన తరువాత రూ.22 వేల కోట్లకు ఎందుకు కుదించారో అర్థం కావడం లేదన్నారు. ఎంపీలు పోలవరం నిధుల కోసం పోరాడాలని, ట్వీట్లతో కాలం గడపకుండా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు.  

లోకేశ్‌పై కేసు నమోదు
నిబంధనలను అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ నడిపినందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు ఆకివీడు ఎస్‌ఐ వై.వీరభద్రరావు సోమవారం చెప్పారు. అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించి, కరోనా నిబంధనల్ని అతిక్రమించి ముంపు ప్రాంతాల్లో పర్యటించినందుకు కేసు నమోదు చేశామన్నారు. లోకేశ్‌ 15 మందికి పైగా వ్యక్తుల్ని ట్రాక్టర్‌పై ఎక్కించుకుని నడిపారని, తృటిలో ప్రమాదం తప్పిందని, ఆయనతోపాటు ట్రాక్టర్‌లో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారని ఎస్‌ఐ వివరించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు