సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్‌ లేదన్న నారా లోకేష్‌ 

1 Dec, 2022 10:14 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. అయితే ఇది ప్రత్యర్థుల మధ్య ఉంటుంది. సింహపురి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం అనేక తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. స్వపక్షంలో పైచేయి సాధించాలనే తపనతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు అధిష్టానం మెప్పు, ఇటు జిల్లాలో పార్టీపై ఆధిపత్యం రెండు దక్కించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర కంటే ముందుగా జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సోమిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఒకరి తర్వాత ఒకరు 
ప్రజా మద్దతు కంటే ముందు అధిష్టానం వద్ద పరపతి పెంచుకోవాలనే తపన టీడీపీ నేతల్లో మెండుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. అదే ఒరవడి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగింది. జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. అటు జిల్లా పరిషత్, ఇటు కార్పొరేషన్‌లో తెలుగుదేశం కండువా కనుమరుగైంది. ఒక్కరంటే ఒక్క ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్‌ ఆ పార్టీకి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం అధిష్టానం మెప్పు పొందాలనే దిశగా జిల్లాలో టీడీపీ నేతల అడుగులు పడుతున్నాయి. ఒకరి తర్వాత ఇంకొకరు వివాదస్పద వ్యాఖ్యలతో తెరపైకి వస్తుండడం విశేషం.

చదవండి: (Chandrababu Naidu: ఇదేం ఖర్మరా 'బాబూ')

ఆధిపత్యం కోసం ఆరాటం 
జిల్లాలో పార్టీపై ఆధిపత్యం కోసం సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరాటపడుతున్నట్లు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు లోకేష్‌ ఓ సందర్భంలో మంగళగిరిలో ప్రకటించారు. టీడీపీ దానికి కట్టుబడి ఉంటే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి టికెట్‌ దక్కదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన సోమిరెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

క్రైమ్‌ రేట్‌ పెరిగిందని బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా పర్యటించాలని, ఆ దిశగా అనుచరగణంతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈనెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా జవనరి నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈలోపు జిల్లాలో సోమిరెడ్డి పాదయాత్ర చేయాలనే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుపు మాట దేవుడెరుగు కనీసం పార్టీ టికెట్‌ అయినా దక్కించుకోకుంటే భవిష్యత్‌లో రాజకీయ పరిస్థితులు ఊహించుకోలేమని పాదయాత్ర ఆలోచనలో ఉన్నారని తెలిసింది.   

మరిన్ని వార్తలు