కాల్‌మనీ వాళ్ల జోలికి వస్తే పీక కోస్తా!

31 Dec, 2020 09:35 IST|Sakshi

విలేకరికి టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు బెదిరింపులు

సాక్షి, తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): టీడీపీ నాయకుడు మీడియా ముసుగులో ‘కాల్‌మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఉండవల్లిలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చెయ్యడం, నూటికి వారానికి పది నుంచి పదిహేను రూపాయల  వసూలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఓ టీవీ చానల్‌ విలేకరి సాయి సందీప్‌ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు గాదె శ్రీనివాసరావు చెప్పడానికి వీల్లేని విధంగా ఫోన్‌చేసి బూతులు తిట్టాడు. ‘కాల్‌మనీ వ్యాపారం చేస్తాను.  చేసేవాళ్లకు కూడా అండగా ఉంటాను. అయితే ఏంటి? నువ్వు జోక్యం చేసుకుంటే  అర్ధరూపాయి బ్లేడ్‌తో పీకకోస్తా ’ అంటూ బెదిరించడంతో బాధితుడు సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో కేసులో కాల్‌మనీ వ్యాపారుల అరెస్టు 
తాడేపల్లి పట్టణ పరిధిలో, విజయవాడలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరిని తాడేపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నులకపేటకు చెందిన అర్చకుడు కృష్ణతేజ విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన అన్నదమ్ములు దుక్కా వేణు, దుక్కా శ్రీను వద్ద రూ.2 లక్షలకు చిట్టీ వేసి ముందుగానే పాడుకున్నాడు. డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదమ్ములు ఇద్దరూ రూ.5లక్షలు చెల్లించాలని కృష్ణతేజపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఖాళీచెక్కులు, ప్రామిసరీ నోటులు తీసుకున్నారు.

వారి బాకీ తీర్చేందుకు నులకపేటకు చెందిన ఝాన్సీ దగ్గర కృష్ణతేజ రూ.75 వేలు, విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన లక్ష్మి వద్ద కూడా అప్పుచేశారు. ఝాన్సీ, లక్ష్మి కూడా కృష్ణతేజ వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు తీసుకుని చెరో రూ.5 లక్షలు చెల్లించాలని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వడ్డీ వ్యాపారుల నుంచి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లు, మరో నాలుగు ఖాళీ చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టుకు హాజరు పరిచినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. (చదవండి: పేద మహిళలను లక్షాధికారులను చేశారు)

మరిన్ని వార్తలు