బాబు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

3 Mar, 2021 05:40 IST|Sakshi

అధికార యంత్రాంగం చర్యలతో రక్తికట్టని నిరసన డ్రామా 

భోజనం, అల్పాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఏర్పాటు 

విమానాశ్రయంలో వైద్యులు, అంబులెన్స్‌.. 

ఆయన్ను హైదరాబాద్‌ పంపేందుకు అన్ని విమానాల్లోనూ టికెట్లు బుక్‌ 

పటిష్ట చర్యలతో టీడీపీ శ్రేణుల ఆశ్చర్యం

సాక్షి, తిరుపతి: ఎన్నికల కోడ్, కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ధర్నా చేయడానికి తిరుపతికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపట్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధపట్ల టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ప్రతిపక్ష నేతపై అధికారులు ఇంతగా శ్రద్ధ తీసుకున్న దాఖలాల్లేవని రాజకీయ పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ చిత్తూరు, తిరుపతిలో టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. వెంటనే హైదరాబాద్‌కు తిరిగి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎన్ని విమానాలున్నాయో అన్నింటిలో టికెట్లు బుక్‌చేశారు. అయితే, పక్కా పథకం ప్రకారం అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు ముప్పుతిప్పలు పెట్టినా.. ఆయన ఆరోగ్యంపట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక వైద్యులు, అంబులెన్స్‌ను ఉదయం నుంచి రాత్రి వరకు విమానాశ్రయంలోనే ఉంచారు. అక్కడ భారీ బందోబస్తునూ ఏర్పాటుచేశారు. అలాగే, తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో పోలీసులను భారీగా మోహరించారు. రేణిగుంట, విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరిని, ప్రతి వాహనాన్ని తనిఖీచేసి అనుమతించారు. విమానాశ్రయంలో వేచి ఉన్న చంద్రబాబును ప్రతి అరగంటకు ఒకసారి వైద్యులు వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా భోజనం, అల్పాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ అన్నీ ఏర్పాటుచేశారు. అయితే, చంద్రబాబు తన ఇంటి నుంచి తెప్పించుకున్న భోజనం, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌నే తీసుకున్నారు. కాఫీ మాత్రమే అధికారులను అడిగి తెప్పించుకున్నారు. 

ఆయన కోరిక మేరకు కలెక్టర్, ఎస్పీ 
కాగా, ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. తాను కలెక్టర్, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడంతో చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడుతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డి చంద్రబాబుతో చర్చించారు. ఆయన చెప్పిన విషయాలను నోట్‌ చేసుకున్నారు. దీంతో ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా చేసిన దు్రష్పచారాన్ని అధికార యంత్రాంగం తిప్పికొట్టినట్లయింది. 9 గంటల పాటు బాబు అండ్‌ కో ఆడిన డ్రామా అధికార యంత్రాంగం పనితీరుతో బెడిసికొట్టింది.  

>
మరిన్ని వార్తలు