బద్ధికొండపై ‘పచ్చ’ కన్ను 

25 Aug, 2020 07:37 IST|Sakshi
బద్ధికొండ చుట్టూ ఉన్న పచ్చని పొలాలు,కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న గొట్టుగుర్కి గ్రామస్తులు

గ్రానైట్‌ తవ్వకాలకు సన్నాహాలు 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గొట్టుగుర్కి గ్రామస్తులు 

తమ జీవితాలు అంధకారం చేయొద్దని వినతి 

ఇది రొళ్ల మండలం పరిధిలోని గొట్టుగుర్కి సమీపంలో ఉన్న బద్ధికొండ. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ 60 శాతం కర్ణాటక పరిధిలో.. మిగిలిన 40 శాతం మన రాష్ట్ర పరిధిలో ఉంది. ఇక్కడున్న కొండలోని 40 ఎకరాల్లో గ్రానైట్‌ ఉన్నట్లు టీడీపీ నేతలు గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ బద్ధికొండపై తవ్వకాలకు అనుమతి ఇస్తే తమ గ్రామమే వల్లకాడవుతుందని గొట్టుగుర్కివాసులు ఆందోళన చెందుతున్నారు. 

అధికారంలో ఉన్నన్నాళ్లూ పంచభూతాలను కబ్జా చేసిన టీడీపీ నేతలను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుద్ధిమార్చుకోలేదు. ఏకంగా ఓ ఊరంతా నాశనమైనా సరే తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. తమ స్వార్థం కోసం నాలుగు గ్రామాలకు అండగా ఉన్న బద్ధి కొండను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పచ్చని పొలాలను.. గలగలపారే సెలయేళ్లను.. వాటిపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులను బలి చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ప్రజలంతా ఏకమై పచ్చనేతల తీరును తూర్పారపడుతున్నారు.   

రొళ్ల : మండల పరిధిలోని గొట్టుగుర్కి సమీపంలో ఉన్న బద్ధికొండపై టీడీపీ నేతల కన్ను పడింది. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా మిగిగేశి హోబళి రెడ్డిహళ్లి గ్రామంతో పాటు గొట్టుగుర్కి గ్రామాల మధ్య ఉన్న ఈ కొండలో విలువైన గ్రానైట్‌ ఉన్నట్లుగా పసిగట్టిన టీడీపీ నేతలు.. ఎప్పుడెప్పుడు కొండను కరిగిద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రానైట్‌ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు.  

చారిత్రాత్మక కొండ 
బుద్ధికొండకు చాలా చారిత్రక నేపథ్యముంది. ఈ కొండ పై చిన్నపాటి కోటగోడ కూడా ఉంది. దళితుల కులదైవం ఓబుళనరసింహస్వామి దేవాలయం కూడా ఈ కొండలోనే ఉంది. కొండపై ఉన్న కన్నేరమ్మదొణ ప్రాధాన్యత సంతరించుకుంది.  

కుంటల నిలయం బద్ధికొండ 
బద్ధికొండ ప్రాంతంలో బావులు, కుంటలు, చెక్‌డ్యాంలు అధికంగా ఉన్నాయి. నాగన్న, పెద్దపులి, కృష్ణప్ప, రామాంజప్ప, భూతప్ప, రాజప్ప, కర్ల, పాతన్న, బాపనోళ్ల, నల్లప్ప కుంటలు ఈ కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. గ్రామస్తులు భూతప్ప జలధి చేసే స్థలం కూడా ఈ కొండ ప్రాంతంలోనే ఉంది. వర్షాకాలంలో ఈ కొండ ప్రాంతంలోని కుంటలు, కట్టలన్నీ పూర్తిగా నిండుతాయి. ఫలితంగా ఈ గ్రామ పరిధిలో 165 బోర్లల్లో భూగర్భజల మట్టం పెరిగి సాగుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు చెబుతున్నారు. 

150 ఎకరాల్లో విస్తరించిన పూలతోటలు 
బుద్ధికొండ సమీపంలోని దాదాపు 150 ఎకరాల్లో రైతులు చామంతి, బంతి, కనకాంబరం ఇతరాత్ర పూలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పూర్ణిమ, పచ్చ, గుండు పచ్చ, డోన్‌ పచ్చ, కర్నూలు రకం, కలర్‌ చామంతి, చాందిని, బంతి, మల్లె తదితర వంటి చామంతి రకాల పూలను పండిస్తున్నారు. ఈ పూలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండగా.. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు  తరలించి అమ్ముకుంటారు. ఈ నేపథ్యంలో ఈ కొండపై గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతిస్తే దుమ్ము, ధూళి చెలరేగి పూలతోటలన్నీ నాశమవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

దళితులకు తీరని నష్టం 
బద్ధికొండకు అరకిలోమీటరు దూరంలోనే గొట్టుగుర్కి గ్రామం ఉంది. ఎస్సీ కాలనీ ఈ కొండకు పూర్తిగా ఆనుకుని ఉంది. ఈ గ్రామంలో సుమారు 350 కుటుంబాలుండగా.. ఇందులో 20 దళిత కుటుంబాలు కొండకు ఆనుకునే ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కొండపై గ్రానైట్‌ తవ్వకానికి అనుమతిస్తే ఎక్కువగా నష్టపోయేది దళిత కుటుంబాలే.  అందుకే వారు  ఇప్పటికే కలెక్టర్, సంబంధిత మంత్రితో పాటు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.  

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
అనంతపురం అర్బన్‌: రొళ్ల మండలం గుడ్డగుర్కి పంచాయతీ గొట్టుగుర్కి గ్రామం చుట్టూ ఉన్న రత్నగిరి గ్రామ సర్వే నెంబర్లు 152, 157, 93 లోని బద్దికొండ, మాలకొండల్లో గ్రానైట్‌ తీసేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని రైతులు రోడ్డెక్కారు. సోమవారం కలెక్టరేట్‌ ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు తిమ్మారెడ్డి, శ్రీరాములు, మూర్తి, రాయుడు మాట్లాడారు. బద్దికొండ, మాలకొండ.. కొండల చుట్టూ గొట్టుగుర్కి, గుడ్డగుర్కి, క్యాతప్ప పాళ్యం, వన్నప్పపాళ్యం, దాసప్ప పాళ్యం, గిరేనాయకుని పాళ్యం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాడప్ప పాళ్యం, రెడ్డిహళ్లి గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ కొండపై తవ్వకాలకు అనుమతి ఇస్తే ఆయా గ్రామాలన్నీ కనుమరుగవుతాయన్నారు. అనంతరం స్పందనలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు లింగరాజు, నాగేంద్ర, తదితరులు ఉన్నారు.  

ప్రజలు రోగాల బారిన పడతారు 
బద్ధికొండపై తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. కొండపై క్వారీ పనులు ప్రారంభిస్తే కుంటలు మాయమై భూగర్భజలం పూర్తిగా అడుగంటి పోతుంది. దుమ్ముధూళి వల్ల పంటలన్నీ దెబ్బతింటాయి. ప్రజలు కూడా రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. 
– శ్రీరామప్ప, గొట్టుగుర్కి, రొళ్ల మండలం 

పర్యావరణానికి హాని 
బద్ధికొండలో గ్రానైట్‌ తవ్వకానికి అనుమతి ఇస్తే మా గ్రామం మొత్తం నష్టపోతుంది. ప్రధానంగా కొండలోని కుంటలన్నీ కనుమరుగవుతాయి. దుమ్మూ ధూళికి పూల తోటలన్నీ దెబ్బతింటాయి. పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది.  
– నరసింహమూర్తి, గొట్టుగుర్కి, రొళ్ల మండలం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా