‘పొరంబోకు’లో పాగా!

24 Sep, 2020 10:04 IST|Sakshi
పాలసముద్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆక్రమించిన రస్తా పొరంబోకు భూమిలో నిర్మించిన క్యాంటీన్‌

పాలసముద్రంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా 

వెంచర్‌కు దారి, పక్కనే క్యాంటీన్‌ ఏర్పాటు 

గోరంట్లలో హోటళ్లు ఏర్పాటు చేసిన మరో టీడీపీ నేత 

చోద్యం చూస్తున్న అధికారులు

గోరంట్ల–హిందూపురం రహదారికి ఆనుకుని టీడీపీకి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్వరరావు వేసిన వెంచర్‌ ఇది. ఈ పక్కన ఉన్న బ్లూకలర్‌ బిల్డింగ్‌ క్యాంటీన్‌. ఈ వెంచర్‌కు వెళ్లే ప్రధాన రహదారి, క్యాంటీన్‌ ఏర్పాటు చేసిన స్థలం రస్తా పొరంబోకు. కానీ టీడీపీ హయాంలో సదరు రియల్‌ వ్యాపారి అప్పటి టీడీపీ నేతల అండతో దాదాపు 97 సెంట్లు ఆక్రమించాడు. దర్జాగా తన వెంచర్‌కు దారి ఏర్పాటు చేసుకోవడంతో పాటు పక్కనే క్యాంటీన్‌ ఏర్పాటు చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టీడీపీ నేత ఆక్రమించిన రస్తా పొరంబోకు స్థలం విలువ మార్కెట్‌లో రూ.కోటిపైనే. అయినా ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోని పరిస్థితి.  

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో జిల్లాలోనే పేరుగాంచిన ప్రాంతం గోరంట్ల. ఇక పాలసముద్రం పేరు చేబితేనే రియల్‌ భూం కళ్లముందు గిర్రున తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నాసన్, బెల్‌ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తుండగా.. భూములకు రెక్కలొచ్చాయి. సెంటు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు రియల్‌ వ్యాపారాన్ని జోరుగా సాగించారు. ఏకంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య సముదాయాలుగా మార్చుకుని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. 

గోరంట్ల: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ‘కియా’ అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడంతో పాలసముద్రం ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. అప్పటికే అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. ఆ పార్టీ అధికారంలో ఉండగా కబ్జారాయుళ్ల అవతారమెత్తారు. కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇలా వెంకటేశ్వరావు అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గత టీడీపీ హయాంలో పాలసముద్రం సమీపంలోన హిందూపురం–కదిరి ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్‌ 230, 232లో 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని ఆక్రమించి తాను ఏర్పాటు చేసిన వెంచర్‌లో కలిపేసుకున్నాడు. వెంచర్‌కు వెళ్లేందుకు రస్తాపొరంబోకులోనే ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడంతో పాటు పక్కనే క్యాంటీన్‌ నిర్మించాడు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇబ్బంది లేకుండా ప్రభుత్వ భూమిలోనే వినాయకుడి గుడి నిర్మించాడు. కళ్లముందే ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోని పరిస్థితి. పైగా సదరు వ్యాపారి వద్ద ముడుపులు తీసుకుని ఆక్రమణకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 

గోరంట్లలో మరో తమ్ముడి నిర్వాకం 
గోరంట్లకు చెందిన మరో టీడీపీ నేత ఆక్రమణల్లో తాను తక్కువ తినలేదని నిరూపించాడు. కదిరి– హిందూపురం ప్రధాన రహదారి పక్కన మార్కెట్‌ యార్డు సమీపంలో 275–4 సర్వే నంబర్‌లోని 24 సెంట్ల రస్తాపొరంబోకు భూమిని ఆక్రమించి తన పొలంలో కలిపేసుకున్నాడు. అక్కడ చిన్న చిన్న హోటళ్లు, వ్యాపార సముదాయలు ఏర్పాటు చేసి నెలనెలా బాడుగలు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ సెంటు భూమి రూ.8 లక్షల పైమాటే. భవిష్యత్‌ అవసరాల కోసం వదలిన రస్తాపొరంబోకు స్థలాలను టీడీపీ నేతలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

గోరంట్లలోని రస్తా పొరంబోకులో టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన దుకాణాలు  

నోటీసులిచ్చాం 
పాలసముద్రం రెవెన్యూ పొలం సర్వే నంబర్‌ 230, 232లోని 97 సెంట్ల రస్తా పొరంబోకు భూమిని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించినట్లు గుర్తించాం. గత ఆగస్టులోనే సదరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి నోటీసులు జారీ చేశాం. అలాగే గోరంట్లలోని సర్వే నంబర్‌ 275–4లోని 24 సెంట్ల రస్తా పొరంబోకును మరో వ్యక్తి అక్రమించినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తాం.  – బాలకిషన్, తహసీల్దార్, గోరంట్ల          

మరిన్ని వార్తలు