అటవీ భూమి హాంఫట్‌..!

29 Jul, 2020 12:50 IST|Sakshi
టీడీపీ నాయకుల ఆక్రమణలను అడ్డుకొని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు

తిమ్మపాలెం (పొన్నలూరు): పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెం గ్రామంలో చెరుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 787, 787/1తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారుగా 1708 ఎకరాల ఫారెస్ట్, పశువుల మేత బీడు భూములు విస్తారంగా ఉన్నాయి. వీటిలో సుమారు 700 ఎకరాలు ఆక్రమణకు గురైంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతిపరులు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అప్పటి నుంచి నేటి వరకు అక్రమార్కులు తమ పట్టా భూమికి సమీపంలో ఉన్న అటవీ, పశువుల బీడు భూములను కొంచెం, కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. రోజులుగా అటవీ భూములను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా చదును చేసి జామాయిల్, కంది, బత్తాయి, వరి, మినుముతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. మొదటిలో కొంత భూమిని మాత్రమే ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ఈ వ్యవహారాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడంతో ఎకరాల కొద్దీ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. 

గత ప్రభుత్వం హయాం నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణకు అలవాటుపడిన గ్రామంలోని టీడీపీ నాయకులు నేడు కూడా యథేచ్ఛగా అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధిగా చెప్పుకుంటూ తిరిగే ఒక దళారిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ తమపని తాము కానిస్తున్నారు.   

ఆక్రమిత భూమి విలువ ఎకరా రూ.3 లక్షలు:  ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమి విలువ నేడు బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. ఇలా ఆక్రమణకు గురైన వందల ఎకరాల అటవీ, పశువుల బీడు భూముల విలువ నేడు కోట్లలోనే ఉంది. అలాగే కొందరు అక్రమార్కులు వారు ఆక్రమించిన భూములకు ఎలాంటి పత్రాలు లేకుండానే మరొకరికి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారికి ఎకరా భూమి రూ.6 వేలు చొప్పున కౌలు కింద ఇస్తున్నారు. ఆక్రమిత భూమికి దొంగ చాటుగా పట్టాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అక్రమాల వలన కనీసం గ్రామంలోని పశువులు ఈ భూముల్లోకి వెళ్లడానికి దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం  ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో దున్నుతుంటే గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదని గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూమిని ఆక్రమించుకుంటూ పోవడం వలన పశువులు కూడా అటుగా పోయే మార్గం లేదని టీడీపీ సానుభూతిపరులను నిలదీశారు. మీ చర్యలు వలన గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. 

అధికారుల ఆదేశాలు బేఖాతరు.. 
ఇదిలా ఉంటే తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆక్రమణదారులకు నోటీసులు పంపించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యవసాయ పనులు చేస్తే ట్రాక్టర్లను సైతం సీజ్‌ చేస్తామని గ్రామంలో ఇటీవల దండోరా కూడా వేయించి, ప్రభుత్వ భూమిలోకి ఎవరు వెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులు కావాలనే రెవెన్యూ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ హెచ్చరిక బోర్డులను తొలగించి తమ పట్టా భూములకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్లతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తాము అటవీ, పశువుల బీడు భూములను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ప్రభుత్వ భూముల జోలికి వెళ్లవద్దని చెప్పినా వారు వెళ్లిపోయిన తరువాత అక్రమార్కులు తమపని తాము కానిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటవీ, పశువుల బీడు భూముల ఆక్రమణపై స్పందించి పటిష్ట చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు