సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి! 

24 Mar, 2021 08:19 IST|Sakshi

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో టీడీపీని అభద్రతా భావం వెంటాడుతోంది. ఆ పార్టీ నేతలు వేసే ప్రతి అడుగూ బెడిసికొడుతోంది. ఒక వ్యూహం పన్నితే అది కాస్తా బూమరాంగ్‌ అవుతోంది. ఒకరిని ఇన్‌చార్జిగా నియమిస్తే శ్రేణులే వేలెత్తి చూపే పరిస్థితి ఏర్పడుతోంది. నియోజవకవర్గాల్లో ప్రచారానికి వెళితే కార్యకర్తలే నిలదీస్తుండడంతో నాయకుల్లో ఆత్మస్థైర్యం దిగజారిపోతోంది. తమ్ముళ్ల వైఖరి ఆ పార్టీ అగ్రనేతలను సైతం డైలమాలో పడేస్తోంది.

సాక్షి, తిరుపతి: టీడీపీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో ఇవి ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. కార్యకర్తల్లో అంతర్గతంగా జీర్ణించుకుపోయిన అంశాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేతలను అవి నిగ్గదీసి కడిగేస్తున్నాయి. 

పనబాక.. పట్టించుకోబాక! 
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును ఆ పార్టీ అధిష్టానం మూడు నెలలు ముందు ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఎవరికీ చెప్పలేదు. కనీసం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల నేతలకు, ఇన్‌చార్జిలకు తెలియజేయ లేదు. ఆమె బీజేపీలో చేరిపోతారనే అభద్రతా భావంతో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ముందే ప్రకటించేశారు. ఆ ప్రకటన తర్వాత ఆమె ఇంతవరకు ప్రజల మధ్యకు రాలేదు. పంచాయతీ, పుర ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఉప పోరుకు నోటిఫికేషన్‌ వెలువడడంతో తాజాగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒకడుగు ముందుకువేస్తే, మూడడుగులు వెనక్కి పడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.  

నిలదీత.. అంతా రోత 
పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల టీడీపీ నేతలు ప్రచారాలు మొదలుపెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టారు. మండల, నియోజకవర్గాలకు ముందు ఇన్‌చార్జీల విషయం తేల్చాలని భీష్మించుకుంటున్నారు. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం బహిర్గతమైంది. వారిని సర్దిచెప్పేందుకు టీడీపీ సీనియర్‌ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్టయ్యింది. తిరుపతిలో తెలుగు యువత అధ్యక్షుడుగా రవినాయుడు నియామకంపై కొందరు పెదవి విరిచారు. ఎంతో కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని వస్తున్న నేతలను పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాల్లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. 

సోమిరెడ్డి..ఓడగొడతావేంటి! 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బాధ్యుడిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని నియమించడంపై టీడీపీ అభ్యర్థి పన బాకలక్ష్మితో సహా ఆయా నియోజకవర్గాల కేడర్‌ కినుకు వహించినట్లు సమాచారం. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు సర్వేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. ప్రజల మెప్పు పొందడంలో విఫలమయ్యారు. అలాంటి నాయకుడ్ని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎలా నమ్ముతారని పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమా    చారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల మొత్తంగా పరిశీలిస్తే టీడీపీ ప్రతిచర్య భూమ్‌రాంగ్‌ అవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

చదవండి: బరిలో ఉమ్మడి అభ్యర్థి

మరిన్ని వార్తలు