చంద్రగిరిలో టీడీపీ ఇసుక దందా..

22 Jul, 2021 14:52 IST|Sakshi
ఇసుక అక్రమ రవాణాకు వినియోగిస్తున్న జేసీబీ

సాక్షి,చంద్రగిరి: మండలంలో టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచి అలవాటైన అక్రమ రవాణా నేటికీ కొనసాగుతోంది. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సొంత పంచాయతీ కందులవారిపల్లి కేంద్రంగా టీడీపీ మాఫియా ఏర్పాటైంది. శేషాపురానికి చెందిన టీడీపీ నాయకులు, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు బంధువుతో కలసి, బుధవారం రాత్రి నుంచి బీమానదిలో ఇసుక తవ్వకం మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లను ఉపయోగించి కందులవారిపల్లి నుంచి పులిచెర్లకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొత్తపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.5 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. 

వాగులు, వంకల్లో ఇసుక ఖాళీ 
భీమా నది పరిసర ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను తోడేశారు. దీంతో సమీప బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటల సాగుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. అక్రమ రవాణాదారులపై ఫిర్యాదు చేస్తే దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుండడం గమనార్హం. 

పట్టించుకోని యంత్రాంగం  
అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్‌ఓ, వీఆర్‌ఏలతో పాటు గ్రామ పోలీసులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో కొందరు గుట్టుగా అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌  
ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప బుధవారం రాత్రి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తవ్వుతున్న వాహనాలను సీజ్‌ చేయాలని చెప్పారు. అయితే డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ నిమిషాల వ్యవధిలో ఇసుక స్మగ్లర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన బీమానది నుంచి జేసీబీలు, ట్రాక్టర్లను మళ్లించేశారు. వారు వెళ్లిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ ఏమీ లేదంటూ చేతులు దులుపుకుని వెనుదిరగడం కొసమెరుపు.  

మరిన్ని వార్తలు