‘పల్లెకు టికెట్‌ ఇస్తే పనిచేయం’

28 Jul, 2022 15:40 IST|Sakshi
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి (ఫైల్‌ ఫోటో )

అనంతపురం (పుట్టపర్తి టౌన్‌): వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పనిచేసేది లేదని టీడీపీ సీనియర్‌ నాయకుడు, పార్టీ మాజీ కార్యవర్గ సభ్యుడు పెద్దరాసు సుబ్రహణ్యం స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి ఆరామంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి వ్యవహార శైలితో నియోజవర్గంలో టీడీపీ భూస్థాపితం అవుతోందని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా, సీనియర్‌ నాయకులకు వెన్నుపోటు పొడిచారన్నారు. కియా వద్ద, అనంతపురం పట్టణాల్లో 1,300 ఎకరాలు, రూ. 4 వేల కోట్ల ఆస్తి కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

 జేసీ బ్రదర్స్‌ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి కానీ పల్లె ఆస్తులపై ఈడీ ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. తమకు ఒక్క కళాశాల ఉంటే సీ గ్రేడ్‌లో ఉందని, పల్లెకు 40 కాలేజీలు ఉంటే అన్నీ ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏ లోటు లేకుండా అందుతోందన్నారు. అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అవకాశం కల్పిస్తే అధిష్టానంతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చిస్తామని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో, ప్రత్యామ్నాయం ఎంచుకోవడమో చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారాదప్ప, లక్ష్మీనారాయణ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు