ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే 

1 Sep, 2021 07:36 IST|Sakshi
టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని భూమి

ప్రసన్నాయపల్లిలో 24.49 ఎకరాల ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే 

ఐదెకరాలు ఆక్రమించిన పరిటాల అనుచరుడు 

అందులో ఇటీవల 4.17 ఎకరాలు ఇతరుల పేరిట రిజి్రస్టేషన్‌ 

సబ్‌ రిజి్రస్టార్‌కు భారీగా ముడుపులు !  

రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీలోని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు కాజేశారు. అప్పటి మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు ఈ ఆక్రమణల పర్వానికి ముఖ్య సూత్రధారిగా వ్యవహరించాడు. ఎకరా రూ.4 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయించి భారీఎత్తున సొమ్ము చేసుకున్నాడు. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్టేషన్‌ అధికారులు కళ్లు మూసుకుని రిజిష్టర్‌ చేసి అక్రమార్కులకు సహకరించారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడంతో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కొందరు టీడీపీ నేతల కన్ను సర్వే నంబరు 123లోని ప్రభుత్వ భూమిపై పడింది. ఈ సర్వే నంబరులో మొత్తం 34.41 ఎకరాలు ఉండగా.. ఇందులో నాలుగు ఎకరాలను మాజీ మిలటరీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 30.41 ఎకరాల్లో వంక, శ్మశానం, ప్రభుత్వ భూమి కలిపి 5.92 ఎకరాలు పోను మిగిలిన 24.49 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇక్కడ ఎకరా రూ.4 కోట్లకు పైగా పలుకుతోంది. దీంతో టీడీపీ నేతలు అధికారులను నయానో.. భయానో లోబర్చుకుని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించారు.  

పరిటాల అనుచరుడి భార్య పేరిట ఐదెకరాలు 
24.49 ఎకరాల్లో  ఐదెకరాల భూమిని మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు భార్య పంజగల ప్రసన్న పేరుతో  సర్వే నంబర్‌ 123–2 కింద 2015లో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం కూడా జారీ చేశారు. అనువంశికం కింద ఆమెకు హక్కులు కలి్పంచారు. ప్రస్తుతం అడంగల్, 1–బీ లాంటి రెవెన్యూ రికార్డుల్లో ఆమె పేరే కనిపిస్తోంది. ఈ అక్రమ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు సహకరించినట్లు స్పష్టమవుతోంది. 

4.17 ఎకరాల విక్రయం 
ప్రసన్న పేరిట రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదైన ఐదు ఎకరాల భూమి నుంచి ఇటీవల 4.17 ఎకరాలను ఇతరుల పేరిట రిజిష్టర్‌ చేశారు. దీని విలువ రూ.16 కోట్ల పైమాటే. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఈ ఏడాది జూలై 15న అనంతపురం రూరల్‌ సబ్‌రిజిస్టార్‌ సురేష్‌ ఆచారి నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన జంపుగుంపుల వెంకటప్ప, అనంతపురం శారదానగర్‌కు చెందిన బోయపాటి కిరణ్‌బాబు పేరిట రిజిష్టర్‌ చేశారు. తొలుత పెండింగ్‌ నంబరు 1004 కింద రిజి్రస్టేషన్‌ చేసి.. తర్వాత ఐదు రోజులకే (జూలై 20) రెగ్యులర్‌ నంబరు 7835 కేటాయించారు. ఇందుకు గానూ సబ్‌ రిజి్రస్టార్‌కు రూ.20 లక్షల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

అక్రమంగా రిజిస్టేషన్లు
సాధారణంగా ఏదైనా స్థలాన్ని గానీ, భూమిని ఈగానీ రిజి్రస్టేషన్‌ చేయాలంటే సర్వే నంబరును పరిశీలిస్తారు. ఆ సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుంది. అయితే  అనంతపురం రూరల్, యాడికి సబ్‌రిజి్రస్టార్‌ కార్యాలయాల్లో పనిచేసిన కొందరు సబ్‌ రిజి్రస్టార్లు నిషేధిత భూములను సైతం రిజిష్టర్‌ చేశారు. ప్రసన్నాయపల్లి పంచాయతీకి చెందిన సర్వే నంబరు 123లోని భూమిని నిషేధిత జాబితాలో ఉంచామని రెవెన్యూ అధికారులు అధికారికంగా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు తెలిపినా ఉపయోగం లేకుండా పోయింది. ఇందులో చాలా వరకు భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేశారు. 90 శాతం వరకు ప్లాట్లను యాడికి సబ్‌రిజి్రస్టార్‌ కార్యాలయంలో ‘ఏనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ కింద రిజిష్టర్‌ చేయడం గమనార్హం.

సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం 
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం నేరం. సర్వే నంబరు 123–2లోని ఐదెకరాల  భూమిని 2015లో టీడీపీ నేత పి.శ్రీనివాసులు భార్య పి.ప్రసన్న పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ భూమి నిషేధిత జాబితాలో     ఉందన్న విషయాన్ని ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.  
–బి.ఈరమ్మ, తహసీల్దార్, రాప్తాడు 
అలా చేయడం తప్పు 
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రిజిస్ట్రేషన్‌ అధికారులపై ఉంది. నిషేధిత  జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిష్టర్‌ చేయరాదు. సర్వే నంబరు 123–2లో జరిగిన రిజి్రస్టేషన్లను పరిశీలిస్తా. సబ్‌రిజి్రస్టార్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తా.   
– హరివర్మ, జిల్లా రిజి్రస్టార్, అనంతపురం

చదవండి:  కృష్ణా బోర్డు పరిధిలోకి ‘వెలిగొండ’ను తేవాలి 

మరిన్ని వార్తలు