టీడీపీ నేతల హంగామా

12 Sep, 2022 04:24 IST|Sakshi
పోలీసులతో వాదులాడుతూ బారికేడ్లు తోసివేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

పామర్రు వద్ద రోడ్డుపై కార్లలో కూర్చొని ఆందోళన

ఆగిపోయిన వాహనాలు.. ఇబ్బందులు పడ్డ జనం

పోలీసులు బతిమాలినా వినిపించుకోని వైనం

గుడివాడలో పోలీసులతో వాగ్వాదం

సాక్షి, మచిలీపట్నం/పామర్రు/గుడివాడ టౌన్‌/సాక్షి ప్రతినిధి, విజయవాడ : గొడవలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వ్యూహంలో భాగంగా టీడీపీ నేతలు ఆదివారం ప్రయాణికులను, పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ బాబు ఇటీవల తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని  శుక్రవారం విలేకరుల సమావేశంలో ఖండించారు.

ఆ విమర్శలు నచ్చకుంటే ప్రతి విమర్శలో లేక ఫిర్యాదో చేయకుండా పామర్రు, గుడివాడలో నానా హంగామా చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు కృష్ణా జిల్లా కేంద్రమైన బందరు నుంచి తమ అనుచరులుతో గుడివాడ వెళ్లేందుకు పామర్రు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడెప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు వారికి జత కలిసి హైడ్రామాకు తెరలేపారు.

గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు టీడీపీ నేతలను పామర్రు వద్ద అడ్డుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని గుడివాడ డీఎస్పీ సత్యానంద్‌ వారిని కోరారు. అయినా వారు ఒప్పుకోకుండా కార్లలో రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలకు టీడీపీ నేతలు అంతరాయం కలిగించారు. కార్ల వెలుపల ఉన్న వారు రహదారిపై నానా హంగామా చేశారు.

మహిళా కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ రచ్చచేశారు.  పోలీసులు వారందరినీ గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా గుడివాడలో ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాదు, జయమంగళం వెంకటరమణ పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు.

పెయిడ్‌ ఆర్టిస్టులను తరిమికొడతాం
పామర్రులో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై అవాకులు, చవాకులు పేలితే టీడీపీ నాయకులు, పెయిడ్‌ అరిస్ట్‌లను తరిమి కొడతామని హెచ్చరించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. సీఎంను ఇష్టానుసారం దుర్భాషలాడటం తప్పని తెలియదా? అని ప్రశ్నించారు. గుడివాడకు వెళ్లడానికి దమ్ము లేక పామర్రులో ప్రజలను ఇబ్బంది పెట్టడం మీ చేతగానితనమని.. డ్రామాలు, నాటకాలు మానుకోవాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు