గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు

21 Feb, 2023 03:04 IST|Sakshi
గన్నవరంలో పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం

అది సరికాదంటూ నిరసన తెలపడానికి వెళ్లిన వంశీ అభిమానులు 

కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడి 

గన్నవరం టౌన్‌ సీఐ కనకారావు తలకు తీవ్ర గాయం 

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఆ పార్టీ నియోజకవర్గ నేతలు పక్కా వ్యూహంతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వంశీ అభిమానులు, అనుచరులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో వారు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పట్టాభి పలు అసత్య ఆరోపణలు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా వేశారు. దీంతో మూడు రోజులు­గా ఎమ్మెల్యేను టార్గెట్‌­గా చేసుకుని పట్టాభితో పాటు స్థానిక టీడీపీ నేతలు మీడియా సమావేశా­ల్లో విమర్శలను, ఆరోపణలను తీవ్రతరం చేస్తూ రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం సోమవారం గన్నవరం వచ్చి­న పట్టాభి.. మరోసారి ఎమ్మెల్యేను తిడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు.

అప్పటికే ఎమ్మెల్యే కార్యాల­యం వద్ద విలేకరుల సమావేశానికి, వివిధ ప­ను­ల నిమిత్తం వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ర్యాలీగా ఆ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. వీరిపై టీడీపీ నేతలు రాళ్లు విసురుతూ. జెండా కర్రలతో దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది.

అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నేతలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టీడీపీ నేత విసిరిన రాయి తగలడంతో సీఐ పి.కనకారావు తలకు బలమైన గాయమైంది. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఏడు కుట్లు వేశారు. డీఎస్పీ కె.విజయపాల్‌ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలను ఆక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.    
నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు   

పట్టాభి రెచ్చగొట్టడం వల్లే.. 
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గన్నవరంలో ఓ గుంపును వెనకేసుకుని తిరుగుతూ వారిని రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఉద్దేశ పూర్వక దాడికి దిగడం ద్వారా వారిని నియంత్రించి, వంశీ వర్గీయులపై తీవ్ర దాడికి కుట్ర పన్నారని తెలిపారు.

గన్నవరానికి చెందిన వారు కాకుండా, బయటి నుంచి ఇతరులను రప్పించి దాడికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. టీడీపీ కార్యాలయంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వంద మందితో గుంపుగా మోహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ఇందుకు నిదర్శనం.   

నా పని నేను చేసుకుంటున్నా..  
గన్నవరం నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతూ నా పని నేను చేసుకుంటున్నా. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సంకల్పసిద్ది మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు సంబంధించి ఆధారాలు లేకుండా నాపై అత్యంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ నేను ఎంతో సంయమనంతో వ్యవహరించాను.

ప్రత్యక్ష గొడవల జోలికి పోకుండా న్యాయం కోసం వారిపై కోర్టులో కేసు వేశాను. కొంత మంది కిరాయి జీతగాళ్లు వారి జీతం పెంచుకోవడం కోసం.. ఏరా.. ఒరేయ్‌.. బోస్‌డికే.. అంటూ ఇక్కడికొచ్చి నన్ను అతి దారుణంగా తిడుతుంటే నన్ను అభిమానించే వారికి బాధేసింది. అందుకు నిరసన తెలుపుదామని వెళ్లిన వారిపై దాడికి పాల్పడ్డారు. బయట నుంచి టీడీపీ నాయకులు వచ్చి గన్నవరం ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? ఇక్కడ టీడీపీ నాయకులు లేరా?   
– మీడియాతో వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే   

మరిన్ని వార్తలు