అప్పన్న భూముల్లో ‘పచ్చ’ బాబులు

2 Aug, 2021 03:57 IST|Sakshi

సింహాచలం ఆలయ భూముల్లో తిష్టవేసిన వైనం

862.22 ఎకరాల తొలగింపులో లోగుట్టు ఇదే

దేవదాయ కమిషనర్‌కు తెలియకుండానే తొలగింపు

‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు

సర్వే నంబరు–161/1లోని 21.96 ఎకరాలను అప్పట్లో టీడీపీలో ఉన్న మండవ రవికుమార్‌ చౌదరి అనే వ్యక్తి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించాడు. ఈ స్థలంలో భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనేక మందికి విక్రయించారు. ఈ భూమి కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. ఈ సర్వే నంబరులోని భూమిని కూడా ఆలయ ఆస్తుల జాబితా నుంచి తప్పించారు.

ఇది వేపగుంట గ్రామం సర్వే నంబరు–5లో సింహాచలం ఆలయానికి చెందిన భూమి. ఈ భూమిలో బొబ్బర నరసింహం అనే టీడీపీ నేత రెండెకరాల వరకు స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడున్న గెడ్డ పోరంబోకు భూమిని కూడా ఆక్రమించాడు. అలాగే, వేపగుంటలోని సర్వే నంబరు–1లోని ఒక ఎకరాన్ని టీడీపీ నేత గంట్ల పెంటారావు ఆక్రమించుకుని ఏకంగా ఇల్లు  నిర్మించుకున్నాడు. ఈ స్థలం కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చాలా మంది టీడీపీ నేతలు సింహాచలం దేవస్థానం ఆస్తులను కొల్లగొట్టారు. అడవి వరంలో ఆలయానికి చెందిన భూమినే ఒక సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్నింటిని ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో టీడీపీ నేతల వ్యవహారం బయటపడింది.  ఈ వ్యవహారం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేటు వేసి పాగా.! 
సింహాచలం దేవస్థానానికి 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో 862.22 ఎకరాల భూమి ఆలయానికి చెందినది కాదంటూ.. దానిని తొలగించేందుకు అప్పటి ఈవో రామచంద్రమోహన్‌ ద్వారా 2016లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అనుగుణంగా 2016 మే 31న ఫలానా ఆస్తులు సింహాచలం ఆలయానికి చెందినవి అనే ఆధారాలు లేవంటూ.. వాటిని జాబితా నుంచి తొలగించాలని అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫైల్‌ పంపారు. అయితే.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు గానూ సరైన ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఆ అధికారి ఆ ఫైల్‌ను ఈవోకు తిప్పి పంపారు. ఏడాదైనా ఆ ఫైల్‌ తిరిగి రాలేదు. ఆ తరువాత కాలంలో ఇద్దరు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లను ప్రభుత్వం ఎటువంటి కారణాలు లేకుండా బదిలీ చేసింది. ఆ తర్వాత 2017లో 862.22 ఎకరాలను తొలగిస్తూ ఆలయ భూముల జాబితాను ప్రచురించారు. వాస్తవానికి ఈ జాబితా ప్రకటన దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే జరగాలి. ఇక్కడ ఈ నిబంధన అమలు కాలేదు. కేవలం దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని పేర్కొంటూ  862.22 ఎకరాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానంగా టీడీపీ నేతలు ఈ భూములను ఆక్రమించేందుకు ఈ తతంగం మొత్తం నడిపారని దేవదాయ శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రభుత్వానికి నివేదిక
సింహాచలం ఆలయ భూముల వ్యవహారాలతో పాటు మాన్సాస్‌ ట్రస్టు భూముల అక్రమాలపై దేవదాయ శాఖ అధికారులు చేపట్టిన విచారణ నివేదికను గత నెల 16న ఆ శాఖ కమిషనర్‌కు సమర్పించారు. ప్రధానంగా ఆలయ ఆస్తులను కాజేసేందుకే తొలగింపు వ్యవహారం నడిచిందని.. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే ఆలయానికి చెందిన భూములు, ఆస్తులను లీజులకు ఇవ్వడంలో గోల్‌మాల్‌ జరిగిందని నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భూములు ఎవరు ఆక్రమించారు, ఆలయ భూములను లీజుకు ఇవ్వడంలో నిబంధనలను ఎలా తొక్కిపట్టారు, ఎవరికి లీజుకు ఇచ్చారు, ఎవరి ఒత్తిడి ఉందనే కోణంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరింత మంది ‘పచ్చ దొంగలు’ బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు