'ఛీ'టింగ్‌ టీడీపీ నేతలు.. సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట

21 Jun, 2022 15:34 IST|Sakshi

నిర్మించిన టిడ్కో ఇళ్లు 6,576 మాత్రమే..

11,917 మందికి దరఖాస్తుల విక్రయం 

దరఖాస్తుకు రూ.లక్షకు వరకు వసూలు

‘బాదుడే బాదుడు’లో టీడీపీ నేతలను నిలదీస్తున్న జనం

దోచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్‌ 

సాక్షి ప్రతినిధి విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు టిడ్కో ఇళ్ల పేరిట చేసిన గిమ్మిక్కులు ఫలించకపోగా ఇప్పుడు అవి వారి పాలిట శాపాలుగా మారాయి. తమ వద్ద వసూలు చేసిన నగదును తిరిగి ఇచ్చేయాలంటూ జనం ఆ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ఇందుకు టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చీటింగ్‌ చేసి పేద ప్రజలకు శఠగోపం పెట్టారు. 6,500 ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఏకంగా 11,917 మందికి అప్లికేషన్లు విక్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు.

విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గ నాయకులు నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున అప్లికేషన్లు పంచుకుని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పంచాయితీ టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. ‘బాదుడే బాదుడు’ పేరుతో ప్రజల్లోకి వెళ్తే తమను ఎక్కడ బాదుతారోనన్న భయం వెంటాడుతోంది. దీంతో డబ్బులు వసూలు చేసిన నాయకులు ఈ కార్యక్రమానికి ముఖం చాటేస్తు న్నారు. వారి నుంచి డబ్బులు ఇప్పించాలంటూ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు.  

6,500 ఇళ్లకే భూమి కేటాయింపు 
2019 ఎన్నికల ముందు కేవలం 6,500 టిడ్కో ఇళ్లు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ పనులు చూపించి ఏకంగా 11,917 మంది అమాయక ప్రజల నుంచి నగదు జమ చేసుకుంది. 12 వేల ఇళ్ల నిర్మాణానికి సుమారు 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాదులో కేవలం 74 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం టిడ్కోకు అప్పగించింది. ఇచ్చిన భూమి కొండ ప్రాంతం కావడంతో ఇళ్ల నిర్మాణానికి కొండను తవ్వలేక అధికారులు, కాంట్రాక్టర్లు నానాయాతన పడ్డారు. చివరకు 6,576 ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లను చూపి టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 17వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. నిర్మించిన ఇళ్లను బ్లాకులుగా విభజించినట్లు చూపి, స్లిప్పులపై బ్లాకు, ఇళ్ల నంబర్లు వేసి ప్రజలకు పంచింది.

చదవండి: (వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్‌)

అయితే ఆ ఇళ్లు అసలు లేవని తెలుసుకున్న బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని మూడేళ్లుగా టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ప్రజలు తమ నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు, పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. డబ్బులు తిరిగిచ్చేందుకు గడువు విధించారు. ఆ గడువు ముగియడంతో కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన టీఎన్‌టీయూసీ నాయకుడిపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ముగ్గురు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. 

ఇళ్లు నిర్మించకుండానే దోపిడీ
విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో వారి అనుచరులు, టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జులు టిడ్కో ఇళ్ల పేరిట ప్రజల నుంచి భారీగా నగదు వసూలు  చేశారు. కనీసం స్థలం సేకరించకుండా, ఇళ్లు నిర్మించినట్లు, వాటిని బ్లాకులుగా విభజించినట్లు చూపి ప్రజలను నమ్మించారు. రూ.5 వేల అప్లికేషన్‌ను రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.  

చదవండి: (ఇళ్లపై కుళ్లు రాతలు!)

సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట 
టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చేసిన మోసాలకు తోడు, అప్పటి ప్రభుత్వం సైతం దరఖాస్తుదారులతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డీడీలు తీయించింది. ఈ మోసాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు పంపిణీచేసి, మిగిలిన 5,341 మంది బాధితులకు వారు డీడీలు తీసిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయించారు. అంతేకాకుండా బాధితులకు ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చిన విధంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రెట్టింపు మేలు చేశారు.      

మరిన్ని వార్తలు