కర్నూలు టీడీపీలో నిస్తేజం.. అధినేత వ్యవహారం నచ్చకే!

26 Aug, 2021 15:27 IST|Sakshi

కేఈ, టీజీ కుటుంబాలు పార్టీ వీడుతారనే ప్రచారం 

చంద్రబాబు నాయకత్వంపై విమర్శలు

సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది. పార్టీ కార్యక్రమాలకు టీడీపీ నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధిష్టానం వ్యవహారం నచ్చక కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు అన్ని మునిసిపాలిటీలు వైఎస్సార్‌సీపీ వశమయ్యాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదనే భావనకు పార్టీ శ్రేణులతో పాటు నేతలు వచ్చారు.

దీంతోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ సైకిల్‌ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఆయన కుమారుడు టీజీ భరత్‌ మాత్రం టీడీపీలో అంటీముట్టనట్లు కొనసాగుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు ‘కేఈ ఫ్యామిలీ’ హాజరు కావడం లేదు. సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా లద్దగిరికే పరిమితమయ్యారు. టీజీ భరత్, కేఈ శ్యాంబాబు పార్టీ వీడుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీజీ భరత్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు సమాచారం.    

జిల్లాలో ఇదీ పరిస్థితి.. 
కోడుమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి వైఖరి కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. కోట్ల సొంత నియోజకవర్గమైనా..ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నందికొట్కూరులో టీడీపీ నేత బండి జయరాజు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించారు. నియోజకవర్గాన్ని పర్యవేక్షించే మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడే లేరు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు.

ఆదోనిలో మీనాక్షినాయుడు వయోభారంతో రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి , పత్తికొండలో శ్యాంబాబు ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఆలూరులో కోట్ల సుజాతమ్మ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకుని కేసులు, కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు. కుటుంబసభ్యులు కూడా ఆమెకు సహకరించని పరిస్థితి.  శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. పాణ్యం, బనగానపల్లె, కర్నూలు నేతలు స్థానికంగానే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు.

అధినేత వ్యవహారం నచ్చక.. 
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల చంద్రబాబు నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. జిల్లాలోనూ టీడీపీకి చెందిన కొందరు నేతలకు కూడా అధినేత వ్యవహారం నచ్చడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు జనంలోకి రావడం లేదని, హైదరాబాద్‌లో కూర్చుని ‘జూమ్‌’ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం తప్ప ఆయన ఏమీ చేయడం లేదని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

చదవండి: ‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’     

మరిన్ని వార్తలు