Karnataka: చీప్‌ లిక్కర్‌ సిద్దయ్య!  వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!

4 Feb, 2023 11:09 IST|Sakshi

సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్‌కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. 

అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. 
అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా   సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది.  

ఆధిపత్య పోరుతోనే... 
టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్‌గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్‌ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్‌ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు  ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.   

ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. 
సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్‌  పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో  మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్‌కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా    విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం.   

కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్‌.. 
తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ  మండల టీడీపీ కన్వీనర్‌ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్‌ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది.  

సంబరాల్లో మరో వర్గం.. 
మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్‌లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు.  

(చదవండి: సెల్‌ రోగం..అధికమవుతున్న టెక్స్ట్‌ నెక్‌ సిండ్రోమ్‌)

మరిన్ని వార్తలు