మున్సిపాల్టీల్లో గెలిస్తే ఆటోస్టాండ్లు కట్టిస్తాం

27 Feb, 2021 03:27 IST|Sakshi
మేనిఫెస్టో విడుదల చేస్తున్న అచ్చెన్నాయుడు, లోకేశ్‌ తదితరులు 

మేనిఫెస్టో విడుదల చేసిన అచ్చెన్నాయుడు, లోకేశ్‌

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ఉచితంగా ఆటోస్టాండ్లు కట్టిస్తామని ఆ పార్టీ నేత లోకేశ్‌ చెప్పారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యతో కలిసి శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల కోసం తాము 10 వాగ్దానాలు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలవగానే ఆయా మున్సిపాల్టీల్లో ఆటోడ్రైవర్లకు టాయిలెట్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మూతపడిన అన్నా క్యాంటీన్లు తెరిపించి రూ.5కే పేదలకు భోజనం పెడతామన్నారు. పాత పన్నులు పూర్తిగా మాఫీ చేస్తామని, ప్రస్తుత స్లాబులో 50 శాతం పన్ను మాత్రమే విధిస్తామన్నారు.

డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, ఆరు నెలలకోసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని చెప్పారు. గుంతలులేని రోడ్లు వేయిస్తామ ని, వార్డుల్లో పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు, ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు హాళ్లు, మెప్మా బజార్లు, సున్నా వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంచుతామని, ఉచిత మంచినీటి కనెక్షన్‌ ఇచ్చి నీటిపన్ను రద్దు చేస్తామని తెలి పారు. 21 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం పీకిం దని, పంచాయతీరాజ్‌ మంత్రి, మున్సిపల్‌ మంత్రి ఏం పీకారో చెప్పాలన్నారు. పల్లెల్లో గెలిచామని, ఇప్పుడు పట్నం వంతు వచ్చిం దని, తామే గెలుస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు