పలాసలో ఉద్రిక్తత.. మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్‌ అరెస్ట్‌

21 Aug, 2022 11:02 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: పలాసలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపును టీడీపీ అడ్డుకుంది. దీంతో, టీడీపీ వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం ముట్టడికి వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. కాగా, వైఎస్సార్‌సీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు సహా పార్టీ శ్రేణులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల ఆక్రమణలను తొలగిస్తుంటే.. పేదల ఇళ్లను తొలగిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు కొండలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ నేతల చెరలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాము’’ అని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. పలాస ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు వైఎస్సార్‌సీసీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. శ్రీకాకుళం కొత్తరోడ్‌ వద్ద టీడీపీ నేత నారా లోకేష్‌ ఓవరాక్షన్‌ చేశారు. పలాస వెళ్లేందుకు లోకేష్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో లోకేష్‌.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో లోకేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, రణస్థలం పోలీస్‌ స్టేషన్‌కు లోకేష్‌ను తరలించారు.

ఇది కూడా చదవండి: ఓటమి భయంతోనే ఉన్మాదపు కూతలు

మరిన్ని వార్తలు