రైతుల ముసుగులో టీడీపీ దౌర్జన్యం

3 Oct, 2022 06:40 IST|Sakshi
ద్వారకాతిరుమలలో సీఐ వెంకటేశ్వరరావుతో వాగ్వాదం చేస్తున్న టీడీపీ శ్రేణులు

వన్‌వేలో అమరావతి రైతుల పాదయాత్ర.. పోలీసులను తోసుకుంటూ సాగిన టీడీపీ శ్రేణులు 

ద్వారకా తిరుమలలో భక్తులు, స్థానికులు తీవ్ర అసహనం

ద్వారకాతిరుమల: వన్‌వే రహదారిలో పాదయాత్ర చేసేందుకు అనుమతిలేదని అన్నందుకు పోలీసులతో అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా దౌర్జన్యంగా పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ద్వారకా తిరుమలలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆదివారం ఉదయం ఏం జరిగిందంటే.. 

అమరావతి రైతుల పాదయాత్ర సెప్టెంబర్‌ 30న ద్వారకాతిరుమలకు చేరుకుంది. తిరిగి స్థానిక వైష్ణవి ఫంక్షన్‌ హాలు వద్ద ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. అయితే, రూట్‌ మ్యాప్‌ ప్రకారం వారు అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఉగాది మండపం, యాదవ కల్యాణ మండపం మీదుగా రాళ్లకుంట గ్రామానికి వెళ్లాల్సి ఉంది.

అయితే, స్థానిక టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి వన్‌వే రహదారి (బైపాస్‌) మీదుగా, గుడిసెంటర్‌ వైపునకు పాదయాత్ర వెళ్లాలని పట్టుబట్టారు. అయితే, ఆదివారం కావడంతో క్షేత్ర రహదారులు అప్పటికే భక్తుల వాహనాలతో నిండిపోయాయి. దీంతో వన్‌వే మార్గం గుండా పాదయాత్రకు అనుమతిలేదని భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై టి.సుధీర్‌ వారికి సూచించారు.

అయినా టీడీపీ శ్రేణులు వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి హైడ్రామాను సృష్టించారు. ట్రాఫిక్‌ సమస్య కూడా తలెత్తింది. ఎంతచెప్పినా వినకుండా పోలీసులను తోసుకుంటూ వారు ముందుకు సాగారు.  
 
టీడీపీ శ్రేణుల తీరుపై అసహనం 
టీడీపీ నేతల తీరుతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర లగ్జరీ యాత్రగా ఉందని అభివర్ణించారు.

యాత్ర వెంట వెళ్తున్న లగ్జరీ బస్సు, మొబైల్‌ టాయిలెట్లు, మంచాలు, పరుపులు వంటి వాటిని చూసి ఇది పాదయాత్రా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు.. ఈ పాదయాత్ర కోసం మండల టీడీపీ నేతలు దాదాపు రూ.16 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు