Andhra Pradesh: పరుపుల పంచాయితీ.. వాళ్లలో వాళ్లే కొట్టుకున్న ‘అమరావతి’ బౌన్సర్లు

9 Dec, 2021 14:24 IST|Sakshi
మా వాళ్లే కొట్టుకున్నారని చెప్పిన వ్యక్తిని లాక్కెళ్లి చుట్టిముట్టిన అమరావతి రైతులు

ఆనక వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడి చేశారని దుష్ప్రచారం

శ్రీకాళహస్తిలో మహా కుట్రకు తెరలేపిన టీడీపీ

పాదయాత్రికుల వాలకం చూసి విస్తుపోయిన ప్రయాణికులు

నవ్వులపాలయ్యామని బౌన్సర్లపై నిర్వాహకుల ఆగ్రహం

సాక్షి, తిరుపతి: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు విస్తృత ప్రచారం కోసం టీడీపీ శ్రేణులు రకరకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. పాదయాత్ర నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకున్న తరుణంలో రైతుల ముసుగులో ఉన్న బౌన్సర్లు నిద్రపోయే పరుపుల విషయంలో బుధవారం సాయంత్రం గొడవపడి వాళ్లలో వారే కొట్టుకున్నారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో అమరావతి రైతులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి అనుచరులు చితక్కొడుతున్నారంటూ రోడ్డు మీదకొచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు.

అందులో భాగంగా పూతలపట్టు–నాయుడుపేట రహదారి పైకి గుంపుగా చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, కార్లు, బైక్‌ల్లో వెళ్తున్న వారంతా ఏమి జరుగుతోందంటూ ఆరా తీశారు. అక్కడే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, అమరావతి రైతుల ముసుగులో ఉన్న రియల్టర్లు దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడి చేస్తున్నారంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. 

ఏం లేదు.. మా వాళ్లే కొట్టుకున్నారు..
శిబిరం వద్ద ఏం జరుగుతోందోనని రోడ్డుపై నిలిచిన వాహనాల్లో ఉన్న వారంతా పరుగెత్తుకుంటూ పాదయాత్రికులు రాత్రి బస చేసే చోటుకు చేరుకున్నారు. ‘ఏమి జరిగింది.. ఎవరు కొట్టారు’ అని ఆరా తీశారు. అక్కడున్న వాళ్లలో ఓ వ్యక్తి ‘మావాళ్లే కొట్టుకున్నారు.. ఏమీ జరగలేదు.. వెళ్లిపోండి’ అన్నారు. వెంటనే అక్కడున్న వాళ్లు  అతన్ని నోరు మూయించి పక్కకు లాక్కెళ్లారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్నారు. ‘సాక్షి వారు కూడా వచ్చినట్లున్నారు.. లోనికి రానివ్వకండి.. తరిమివేయండి..’ అని పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న వారు కేకలు వేశారు.

వెంటనే ఆ శిబిరం వద్దకు వచ్చిన వారందరినీ దూరంగా పంపించేశారు. పాదయాత్రికుల వాలకం చూసి ప్రయాణికులు విస్తుపోయారు. అనంతరం కొట్టుకున్న వారితో (బౌన్సర్లు) సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఇక్కడికి మీడియా వాళ్లు వచ్చారు. రేపు మన గొడవ పత్రికలు, టీవీల్లో వస్తే ఇన్నాళ్లు మనం చేసిందంతా వృధా అవుతుంది. వైఎస్సార్‌సీపీ వాళ్లు కొట్టారని మేము చెబుతుంటే.. కాదు కాదు మా వాళ్లే కొట్టుకున్నారంటే అర్థం ఏముంది? ఇలాగైతే ఎలా? మాట్లాడటం చేతకానప్పుడు సైలెంట్‌గా ఉండాలి. రేపటి నుంచి మనకు చాలా కీలకం. మనం అనుకున్న ప్లాన్‌ను అనుకున్నట్లు అమలు చేయాలి’ అని క్లాస్‌ పీకారు.  

మరిన్ని వార్తలు