చేతులెత్తేసిన టీడీపీ సీనియర్లు

6 Mar, 2021 06:07 IST|Sakshi

పుర పోరుకు దూరంగా నేతలు

చంద్రబాబుకి దొరక్కుండా జంప్‌

పార్టీ శ్రేణుల్లో అయోమయం  

సాక్షి, అమరావతి: పంచాయతీ ఫలితాలతో తమకు ప్రజాదరణ లేదని తేలిపోవడంతో టీడీపీ సీనియర్‌ నాయకులు మునిసిపల్‌ ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేశారు. అక్కడక్కడా కొందరు తప్పదన్నట్టు మెరిసి మాయమైపోతున్నారు. ఎలాగూ ఓడిపోయే దానికి తాము చేయగలిగిందేముంటుందని మెజారిటీ నాయకులు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా హవా చలాయించిన నాయకులు, సీనియర్లు, మాజీ మంత్రులు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. నీరుగారిపోయిన క్యాడర్‌లో భ్రమలు కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో ఉపయోగం లేదని పలువురు పార్టీ నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.

‘పంచాయతీ’ ఎఫెక్ట్‌.. 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు తర్వాత అంతటి స్థాయి నాయకుడినని ఊహించుకునే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మున్సిపల్‌ ఎన్నికల బాధ్యత తనది కాదని పార్టీ నేతలతోనే చెబుతున్నట్లు తెలిసింది. మీడియాలో కనిపించేందుకు ఆరాట పడే ఆయన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల గురించి ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదని నగర నాయకులు వాపోతున్నారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తగలడంతో ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పంచాయతీ ఎన్నికల్లో అంటీముట్టనట్టు ఉండగా మున్సిపల్‌ ఎన్నికలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రులు సుజయకృష్ణ రంగారావు, శత్రుచర్ల విజయరామరాజు, అశోక్‌ గజపతిరాజు లాంటి  నాయకులు ఓటమిని ముందే గ్రహించి మునిసిపాల్టీలను వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

పలువురు అస్త్ర సన్యాసం..
విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు చాలాకాలం క్రితమే అస్త్ర సన్యాసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పంచాయతీ ఎన్నికల్లో తన సతీమణిని పోటీ చేయించి ఓటమి పాలవడంతో తల ఎత్తుకోలేక మునిసిపల్‌ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడంలేదు. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా గెలుపు పట్ల నమ్మకం లేదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. టీడీపీ సూపర్‌ సీనియర్‌ యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో పూర్తిగా చేతులెత్తేశారు. తుని మునిసిపాల్టీలో అభ్యర్థులను నిలబెట్టలేక ఆయన తమ్ముడు కృష్ణుడు జంప్‌ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరిలో గతంలో పార్టీని నడిపించిన మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.

అధికారంలో ఉండగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పి.నారాయణ ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వల్ల వచ్చే ఒకటి అరా ఓట్లు కూడా రావని పార్టీ నాయకులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియలు వైఎస్సార్‌సీపీతో పోటీ పడలేక పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. కుప్పంలో ఫలితాలతో పార్టీ నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తాను ఇన్‌ఛార్జిగా ఉన్న పలమనేరు మునిసిపాల్టీపైనే ఆశ వదులుకున్నారు. అనంతపురంలో కాల్వ శ్రీనివాస్, పరిటాల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు ఫోన్లు చేస్తున్నా చాలామంది నాయకులు అందుబాటులోకి రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు