టీడీపీలో లైంగిక వేధింపులు: ‘కర్నూలుకు చెందిన ఓ నేత వేధిస్తున్నాడు.. రాజీనామా చేస్తున్నా’

25 Jan, 2023 07:49 IST|Sakshi

మధురవాడ (భీమిలి) : తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ వెల్లడించారు. విశాఖలోని మధురవాడకు చెందిన తాను పదేళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నానన్నారు. బీసీ మహిళా నాయకురాలినైన తనకే ఈ పరిస్థితి ఎదురైందని, టీడీపీలో మహిళలకే కాదు.. మహిళా నాయకురాళ్లకు కూడా రక్షణ కరువైందని పేర్కొన్నారు.

 మంగళవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చురుగ్గా ఉంటున్న తనను కర్నూలుకు చెందిన నేత ఏడాది నుంచి లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆ నేత లైంగిక వేధింపులు తాళలేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు మరికొందరు ముఖ్య నాయకులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు.

 అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. పైగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, ఇతర నేతలు తనను వేధిస్తున్న వ్యక్తికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఈ నేతల వైఖరితో మనస్తాపం చెంది రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అరుణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించినట్టు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు