భూ కబ్జాలు బట్టబయలు

31 Dec, 2020 09:30 IST|Sakshi

భూ ఆక్రమణలకు శాశ్వత చెక్‌

జిల్లాలో 400 గ్రామాల్లో సర్వే ప్రారంభం

జిల్లాలో టీడీపీ నేతల అధీనంలో వందలాది ఎకరాలు

సర్వేతో ఆక్రమణలన్నీ వెలుగులోకి..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక సర్వేతో కబ్జా కోరల్లో ఉన్న భూముల బండారం బట్టబయలు కానుంది. భవిష్యత్‌లో భూ ఆక్రమణలకు శాశ్వతంగా చెక్‌ పడనుంది. జిల్లాలో ఒకటిన్నర దశాబ్ద కాలంలో భూముల విలువలు అపారంగా పెరిగాయి. ఈ పరిణామాలతో రాజకీయ అండతో రెవెన్యూ అధికారులను లోబర్చుకుని బడాబాబులు భూకబ్జాలకు పాల్పడ్డారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు జిల్లాలో వేలాది ఎకరాలను కబ్జా చేశారు. రీ సర్వేతో ఆక్రమణదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  అధికారం అండతో టీడీపీ హయాంలో తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా భూ కబ్జాలకు తెరతీశారు. గ్రామ స్థాయి నేత నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరూ భూములు ఆక్రమించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వందల ఎకరాల భూములు అప్పటి అధికార పార్టీ నేతల కోరల్లోకి వెళ్లాయి. సముద్ర తీర ప్రాంతం మొదలుకుని పెన్నా నది పొరంబోకు వరకు దేన్నీ వదలకుండా శక్తి మేరకు భూములను ఆక్రమించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కలిపి రియల్‌ వెంచర్‌లుగా మార్చి విక్రయాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో వందేళ్ల చరిత్రకు నాంది పలుకుతూ భూ హక్కులను పదిలం చేస్తూ వైఎస్సార్, జగనన్న శాశ్వత భూహక్కు– భూ రక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి సెంటు భూమిని సమగ్రంగా రీ సర్వే చేసి శాశ్వత హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో కబ్జాదారుల్లో టెన్షన్‌ మొదలైంది.

జిల్లాలో అపారంగా ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటు జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి.  
గత  ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధులు కొందరు, తెలుగు తమ్ముళ్లు పట్టణాలు, నగరం మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భూములను చెరపట్టారు.  
ఐదేళ్ల కాలంలో ప్రతి నియోజకవర్గంలో సగటున వెయ్యి ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం.
కొన్ని చోట్ల సాగు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల రొయ్యల గుంతలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని చోట్ల విక్రయాలు చేశారు.  
జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

400 గ్రామాల్లో సర్వే ప్రారంభం  
జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో 400 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో సర్వే పూర్తి చేయనునున్నారు. నెల్లూరు డివిజన్లో 104, కావలి డివిజన్లో 56, గూడూరు డివిజన్‌లో 113, ఆత్మకూరు డివిజన్‌లో 61, నాయుడుపేట డివిజన్‌లో 66 గ్రామాల్లో తొలి విడతగా ఈ నెల 23న గూడూరు రూరల్‌ మండలంలోని రెడ్డిగుంట నుంచి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రారంభించారు. అన్ని రకాల భూములను రీ సర్వే చేసి యజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి భూమిని డ్రోన్‌ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని కంప్యూటర్లో చెక్‌ చేసి రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి కచ్చితమైన కొలతలు వేసి ఉచితంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ప్రత్యేక మ్యాప్‌ ఆధార్‌ తరహాలో యూనిక్‌ నంబర్‌ ఇచ్చి వివరాలు నమోదు చేయనున్నారు. భూ యజమానికి యూనిక్‌ నంబర్, క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించనున్నారు. భవిష్యత్‌లో భూ ఆక్రమణలకు చెక్‌ పడనుంది. 

సాగర తీరం నుంచి సాగుభూమి వరకు..
జిల్లాలో సముద్ర తీరం నుంచి సాగు భూమి వరకు కబ్జా కోరల్లో ఉంది. ప్రధానంగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ భూములను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఆక్రమించి పట్టాలు కూడా సృష్టించుకోవడం గమనార్హం.

కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం, దగదర్తి మండలంలో సగటున 150 ఎకరాలకు పైగా భూములు టీడీపీ నేతల అధీనంలో ఉన్నాయి.  కావలి పట్టణానికి సమీపంలోని సుమారు 50 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణలకు గురయ్యాయి.  
ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం రాగిపాడులో 70 ఎకరాల భూమి టీడీపీ నేత ఆక్రమించగా కొంత స్వాధీనం చేసుకున్నారు. వరికుంటపాడు మండలం బొంగరాలపాడులో 50 ఎకరాల వరకు స్థానిక టీడీపీ నేతలు భూమిని ఆక్రమించారు.  
గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం కడివేడులో 150 ఎకరాలు, కోట మండలం కేశవరం, రాఘవవారిపాళెంలో 25 ఎకరాలు ఆక్రమణల పర్వంలో ఉంది. ఆత్మకూరు నియోజక వర్గంలోని మర్రిపాడు, చేజర్లలోనూ ఇదే తరహాలో ఆక్రమణలు ఉన్నాయి.  
కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా సముద్ర తీర ప్రాంతం ఆక్రమణలకు గురైంది. ఈ మండలంలోని కొరటూరు, మైపాడులో దాదాపు 11 సర్వే నంబర్లలో 150 ఎకరాలు, రామడుగుపాళెంలో 5 సర్వే నంబర్లలో 318 ఎకరాలు, కొరుటూరు ఒకే సర్వే నంబర్లో 23.50 ఎకరాలు, జగదేవిపేటలో 6 సర్వే నంబర్లలో 60 ఎకరాలు ఆక్రమణలో ఉంది. వీటిలో మైపాడు, కొరుటూరులో ఆక్రమిత స్థలాల్లోనే హేచరీలు ఉండడం గమనార్హం. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ తరహా భూ ఆక్రమణలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. భూ రక్ష పథకంతో ఇవన్నీ పూర్తి స్థాయిలో వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు