రెండో ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కిన టీడీపీ 

19 Mar, 2023 05:12 IST|Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాల వెల్లడి   

పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 

తూర్పు రాయలసీమలో కంచర్ల 

ఉత్తరాంధ్రలో చిరంజీవి రావు

సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు కలెక్టరేట్‌/సాక్షి, విశాఖపట్నం : తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపునకు సరిపడా ఓట్లు సాధించ లేక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపును నిర్ణయించాయి. మూడు రోజులుగా కొనసాగిన కౌంటింగ్‌ ప్రక్రియలో శనివారం తుది ఫలితాలు వెలువడ్డాయి.

నువ్వా నేనా అన్నట్టు సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి 7,543 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ రావడమే కాకుండా.. రెండో ప్రాధాన్యతలోనూ ఆధిక్యంలో కొనసాగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి చివరి రౌండులో ఓటమి పాలయ్యారు. చివరి రౌండులో పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు వచ్చిన 19వేల పైచిలుకు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీకి మెజార్టీ వచ్చింది.

బీజేపీ అభ్యర్థి నగనూరు రాఘవేంద్రకు వచ్చిన ఓట్లలోనూ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా టీడీపీకి వచ్చాయి. దీంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి చెందిన ఎక్కువ ఓట్లు చెల్లుబాటు కాకపోవడం కూడా ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బి.రామగోపాల్‌రెడ్డి (టీడీపీ)కి 1,09,781 ఓట్లు, వెన్నపూస రవీంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ)కి 1,02,238 ఓట్లు వచ్చాయి.

కాగా, అనంతపురంలోని కౌంటింగ్‌ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు తిష్ట వేయడంతో తొలి నుంచి అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం రాత్రి ఈ అనుమానాలు నిజమయ్యాయి. వైఎస్సార్‌సీపీ చెందిన ఓట్లు కొన్ని తెలుగుదేశం పార్టీ కట్టల్లోకి వెళ్లినట్టు తేలింది. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మొత్తం ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలని పట్టుపట్టారు.

కానీ ఆ బాక్స్‌ వరకు మాత్రమే లెక్కిస్తామని, మొత్తం రీ కౌంటింగ్‌ కుదరదని అధికారులు చెప్పారు. కౌంటింగ్‌ జరుగుతున్న సేపు తెలుగుదేశం నాయకులు అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు.

రెండో ప్రాధాన్యత ఓటుపై పీడీఎఫ్‌తో పొత్తు వల్లే గెలుపు
తూర్పు రాయలసీమలో, ఉత్తరాంధ్రలోనూ పీడీఎఫ్‌ ఓట్ల వల్లే టీడీపీ అభ్యర్థులు గట్టెక్కగలిగారు. పొత్తు లేకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఓడిపోతామన్న భయంతో ముందే పీడీఎఫ్‌ నేతలను బతిమాలి మరీ టీడీపీ నేతలు రెండవ ప్రాధాన్యత ఓటుపై పొత్తు పెట్టుకున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీ గట్టెక్కగలిగింది.

ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (తూర్పు రాయలసీమ)గా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాకపోవడంతో.. పీడీఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపు వరించింది. శ్రీకాంత్‌కు 1,24,181 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థి వెంపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు కావాల్సి ఉండగా, టీడీపీ మద్దతు అభ్యర్థికి 82,958 ఓట్లు.. వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749, పీడీఎఫ్‌ అభ్యర్థికి 35,148 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 10,884 ఓట్లు వచ్చాయి. దీంతో 36 రౌండ్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ, పీడీఎఫ్‌ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
  

మరిన్ని వార్తలు