చెక్ బౌన్స్ కేసులో విశాఖ జిల్లా కోర్టుకు హాజరైన టీడీపీ నేత అనిత

2 May, 2022 17:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చెక్ బౌన్స్ కేసులో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2015 వేగి శ్రీనివాసరావు అనే టీడీపీ నేత నుంచి అనిత రూ. 70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న డబ్బుకు 2018 సంవత్సరంలో అనిత చెక్‌ ఇచ్చారు. కాగా చెక్ బౌన్స్ కావడంతో 2019లో శ్రీనివాస్‌ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణకు రావడంతో అనిత కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎన్ని సార్లు డబ్బులు అడిగినా అనిత ఏదో ఒక వంక పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. అవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అ‍న్యాయమన్నారు. సొంత పార్టీ నేతలే మోసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని అన్నారు. టీడీపీలో ఉన్నత స్థానంలో ఉన్న అనిత ఇలా చేయడం దుర్మార్గమని వాపోయారు. ఇప్పటికైనా అనిత తన డబ్బులు ఇచ్చేస్తే కోర్టులో ఉన్న కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పారు.
చదవండి: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు

మరిన్ని వార్తలు