పక్కా స్కెచ్‌తో.. సినీ ఫక్కీలో దాడి 

6 Sep, 2020 11:02 IST|Sakshi
 ప్రాణభయంతో విలపిస్తున్న బాధిత కుటుంబం 

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై దౌర్జన్యం 

సాక్షి, పమిడిముక్కల (పామర్రు): మేమంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం.. మీరు వైఎస్సార్‌ సీపీలో చేరతారా అంటూ వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ ఘటన తాడంకి గ్రామంలో జరిగింది.  ఏం జరిగిందంటే .. మండలంలోని తాడంకి గ్రామంలో ఒక బుక్‌కీపర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా తాడంకి రెడ్డిపాలెంకు చెందిన పేద బీసీ మహిళ కాగితాల విజయ దరఖాస్తు చేసుకుంది. లాక్‌డౌన్‌కు పూర్వమే అధికారులు విజయను బుక్‌కీపర్‌గా నియమించారు. అయితే వెంటనే లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించలేదు. బుక్‌కీపర్‌ పనులు వెలుగు సీసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు మహిళలకు సమర్థంగా అందించేందుకు బుక్‌కీపర్‌ను నియమించి చర్యలు చేపట్టాలన్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ సూచనలతో వెలుగు అధికారులు ఈనెల 2వ తేదీన సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం నిర్వహణకు ముందుగానే ఈ నియామకాన్ని అడ్డుకోవాలనే భావనతో ఉన్న టీడీపీ నాయకులు రగడ మొదలెట్టారు. బీసీ కులానికి చెందిన తూర్పుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునేది ఏంటంటూ ప్రచారం లేపి కులాల మధ్య చిచ్చు రాజేశారు. టీడీపీ నాయకుడు జక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు.

2వ తేదీన సమావేశం జరపనున్న అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వచ్చి ప్రభుత్వ అధికారిక సమావేశానికి అడ్డుతగిలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌లపై దూషణలకు దిగారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు టీడీపీ నాయకులను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపివేశారు. దీంతో సమావేశం వాయిదా పడింది.  

అనుకూల వర్గాన్ని రెచ్చగొట్టి బంధువర్గంతోనే..  
సమావేశం వాయిదా పడటంతో టీడీపీ వారు అనుకున్న పని నెరవేరలేదు. ఈనెల 4న రెడ్డిపాలెంలో తమ అనుకూల వర్గాన్ని రెచ్చగొట్టి బంధువర్గంతోనే విజయ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. భవనం పై అంతస్తులో నివాసం ఉంటున్న విజయ, ఆమె భర్త పరమేశ్వరరావుతో విజయ మరిది వీరమహేష్‌ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో విజయ తోటికోడలు కాగితాల రామలక్ష్మి, బంధువులు నీలాపు సంతోష్, నీలాపు కొండ, నీలాపు సూర్యకుమారిలు ఒక్కసారిగా విజయ, పరమేశ్వరరావులపై దాడి చేశారు. భవనం పై నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి రక్తం వచ్చేలా కర్రలు, రాళ్లతో చితకబాదారు.

మేమంతా టీడీపీలో ఉంటే మీరు వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లి తమ నాయకుడు జక్కా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ విజయ, ఆమె భర్త పరమేశ్వరరావు, కుమారుడు అఖిల్, అత్త నర్సాయమ్మను కొట్టారు. తీవ్రంగా దూషించారు.  సమాచారం అందుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ పోలీసు సిబ్బందిని పంపటంతో ఆ కుటుంబం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ విజయ కుటుంబాన్ని మెరుగైన వైద్యం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

ఎమ్మెల్యే కైలే పరామర్శ  
బాధిత కుటుంబానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఫోన్‌లో పరామర్శించారు. వైఎస్సార్‌ సీపీ మండల కార్యదర్శి మారపాక మహేష్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పాతూరి చంద్రపాల్, బీసీ విభాగం నాయకులు కంభపు రాంబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు బొర్రా చినబాబు, కూచిపూడి వెంకటేశ్వరరావు, నారగాని ప్రసాద్,  కొల్లి రాములు మద్దతుగా నిలిచి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. దాడికి పాల్పడిన రామలక్ష్మి, సంతోష్‌కుమార్, కొండబాబు, సూర్యకుమారి, జక్కా శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు