దటీజ్‌ మంత్రి పేర్ని నాని! 

27 Aug, 2020 08:32 IST|Sakshi
పాఠశాల ప్రాంగణం ఎత్తు చేసేందుకు పోసిన మట్టి కుప్పలు

మచిలీపట్నం: సమస్య అంటూ తన దృష్టికి వస్తే చాలు, వెంటనే పరిష్కారం చూపించటంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తన మార్కును చూపిస్తారనేది నానుడి. ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీకి సన్నద్ధం చేసే క్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలల ప్రధానోపధ్యాయులతో మంగళవారం సమావేశమయ్యారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలపై మాటా–మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఖాలేఖాన్‌పేట హైస్కూల్‌ హెచ్‌ఎం డి.శోభారాణి తమ పాఠశాల ప్రాంగణంలో ఇటీవల వరకు రైతు బజారు నిర్వహించటం వల్ల బురదంగా మారిందని, అవకాశం ఉంటే ప్రాంగణంలో నీరు నిల్వలేకుండా ఎత్తు చేయించాలని కోరారు.

ఆమె చెప్పిన సమస్యను మంత్రి పేర్ని వినీ, విననట్లుగానే ఉండి,  సరే చూద్దాం అని చెప్పారు. విధుల్లో భాగంగా ఉపా ధ్యాయులంతా బుధవారం పాఠశాలకు వెళ్లగా అప్పటికే ప్రాంగణంలో మట్టి కుప్పలు వేసి ఉండటం, మట్టి లోడ్లుతో ట్రాక్టర్లు చక్కర్లు కొడుతుండటం చూసి అవాక్కయ్యారు. ‘నానికి ఏదైనా సమస్య చెబితే ఇంతే’ అంటూ ఉపాధ్యాయులంతా గుసగుసలాడుకున్నారు. తమ సమస్యను మంత్రి నాని దృష్టికి తీసుకెళ్తే, మరుసటి రోజునే పరిష్కారం చూపించటంతో ఉపాధ్యాయ వర్గాలు బుధవారం ఇదే విషయమై మాట్లాడుకున్నారు. ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్‌ గ్రూపుల్లోనూ ఇదే విషయమై చర్చసాగింది. ‘దటీజ్‌ పేర్ని నాని’ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర మంత్రి పేర్ని నాని సకాలంలో స్పందించిన తీరుకు ఉపాధ్యాయ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  

మరిన్ని వార్తలు